Trading Deal
-
ఎయిర్టెల్, జియో మధ్య ముగిసిన భారీ డీల్..!
టెలికమ్యూనికేషన్స్ దిగ్గజాలు ఎయిర్టెల్, రిలయన్స్ జియోల మధ్య కీలక ఒప్పందం ముగిసింది. టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మూడు సర్కిల్స్‌లో 800 Mhz ఎయిర్‌వేవ్‌ల(స్పెక్ట్రమ్)ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించే ఒప్పందం నేటితో ముగిసింది. రెండు దిగ్గజ టెలికాం ప్రత్యర్థుల మధ్య డీల్ జరగడం ఇదే మొదటిసారి. స్టాక్ ఎక్స్ఛేంజీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్టెల్ తన మూడు సర్కిల్లలోని 800 MHz స్పెక్ట్రంను బదిలీ చేయడానికి రిలయన్స్ జియోతో తన వాణిజ్య ఒప్పందాన్ని ముగిసినట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లోని ఎయిర్టెల్ 800Mhz స్పెక్ట్రమ్‌ను జియో పొందనుంది. ఒప్పందం ప్రకారం జియో ఎయిర్‌టెల్‌కు సుమారు రూ. 1004.8 కోట్లను ముట్టచెప్పింది. అంతేకాకుండా జియో అదనంగా స్పెక్ట్రమ్ బాధ్యతలు చేపట్టడానికి సుమారు రూ. 469. 3 కోట్లను ఎయిర్‌టెల్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్టెల్ తన 800 Mhz స్పెక్ట్రంను రిలయన్స్ జియోకు విక్రయించడానికి ఒక ట్రేడింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెగ్యులేటరీ చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్‌లో 3.75 Mhz, ఢిల్లీలో 1.25 Mhz ముంబైలో 2.5 Mhz బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించడానికి జియోకు ఆఫర్‌చేసింది. -
ఎయిర్‌సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం
భారతీ ఎయిర్టెల్, ఎయిర్‌సెల్ కు మధ్య మొత్తం ఏడు సర్కిళ్లలో స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్ కుదిరింది. ఒడిశాలోని ఎయిర్‌సెల్ 4 జీ ఎయిర్వేవ్స్కు సంబంధించిన స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఈ కొనుగోలుతో మొత్తం ఎయిర్‌సెల్ ఎనిమిది సర్కిళ్లలో ఏడింటినీ ఎయిర్‌టెలే నిర్వహించనుంది. తమిళనాడు(చెన్నైతో కలిపి), బీహార్, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా సర్కిళ్లలో పూర్తి 4జీ ఎయిర్‌వేవ్స్ హక్కులను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. గతనెలే టెలికాం సంస్థలు కుదుర్చుకోబోయే ఈ స్పెక్ట్రమ్ షేరింగ్ డీల్‌కు టెలికాం శాఖ నుంచి డీఓటీ నుంచి అనుమతి లభించింది. ఈ కొనుగోలు హక్కులతో ఎయిర్‌సెల్ కు చెందిన 20 మెగాహెడ్జ్ 2300 బ్యాండ్ బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ వాడుకోనున్నట్టు బీఎస్ఈకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఒడిశా సర్కిల్ ప్రతిపాదన లావాదేవీలను విజయవంతంగా ముగించినట్టు ఎయిర్టెల్ తెలిపింది. స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్‌తో రూ.3500 కోట్లకు ఎయిర్‌సెల్ కు చెందిన ఎనిమిది సర్కిళ్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను సొంతంచేసుకోబోతున్నామని భారతీ ఎయిర్టెల్ ఏప్రిల్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్, ఎయిర్‌సెల్ మధ్య జరిగిన ఈ స్పెక్ట్రమ్ డీల్ 2030 సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది.