‘గులాబీ’కి అలకల ముల్లు
ప్రస్తుత ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లే లక్ష్యంగా ఇతర పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్న టీఆర్ఎస్లో అసంతృప్తుల సెగ తగులుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయకులకు.. వరుస వలసలతో ఆందోళన పెరుగుతోంది. టీఆర్ఎస్కు మొదటి నుంచి పట్టున్న వరంగల్ జిల్లాలో పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలే ఉన్నారు. ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా... 2004 కాంగ్రెస్, 2009లో టీడీపీతో పొత్తులతో అవకాశం రాలేకపోయిన నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం ఉన్నారు.
స్వతంత్రంగా పోటీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తుండడంతో... ఇప్పటివరకు అవకాశం రాని వారిలో ఆశలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న వారు ఇదే ఉద్దేశంతో ఉన్నారు. సాధారణ ఎన్నికల తరుణంలో ఇప్పుడు ఇతర పార్టీల నేతలు వరుసగా వస్తుండడం టీఆర్ఎస్ సీనియర్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఇతర పార్టీల నేతలను తీసుకోవడంతో పార్టీ బలపడడం సంగతి ఎలా ఉన్నా... తమను కనీసం సంప్రదించకపోవడంతో పాత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
తెలుగుదేశం చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. ఆమె రాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ ఇన్చార్జి బి.కిషన్‌నాయక్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరో నేత బూక్యా రామారావు అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరారు. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారు సత్యవతి రాథోడ్ రాకతో అసంతృప్తితో ఉన్నారు. స్థానిక ఎన్నికల బీఫారంల పంపిణీలో సొంత వర్గానికే ప్రాధాన్యమివ్వడంతో మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ ఉంది. నియోజకవర్గ ఇన్చార్జి అచ్చ విద్యాసాగర్ 2009లో ఓడిపోయారు.
అప్పటి నుంచి ఇన్చార్జిగా పని చేస్తున్నారు. రాష్ట్ర నేతలు గుడిమళ్ల రవికుమార్, నన్నపునేని నరేందర్, బొల్లం సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు టికెట్‌పై ఆశతో పని చేసుకుంటూ వచ్చారు. వీరిలో ఏ ఒక్కరికి వచ్చినా అందరూ సహకరించుకోవాలనే అవగాహనకు వచ్చారు. మాజీ మంత్రి కొండా సురేఖ ఇటీవల టీఆర్ఎస్లో చేరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.
టికెట్ ఆశించిన వారంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ నగరపాలక సంస్థలో పద వుల విషయంలో వీరికి హామీ ఇచ్చేలా కాంగ్రెస్ నుంచి ప్రతిపాదనలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2004 ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన టీఆర్ఎస్ నేత జి.విజయరామారావు మంత్రిగా పనిచేశారు. 2008 ఉపఎన్నికల్లో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో మళ్లీ తన దృష్టి అంతా స్టేషన్ఘన్పూర్పైనే పెట్టారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న 2012లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
2009 ఎన్నికల్లో రాజయ్య చేతిలో పరాజయం పాలైన టీడీపీ సీనియర్ నేత కడియం శ్రీహరి 2013లో టీఆర్ఎస్ చేరారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం టీఆర్ఎస్లో మూడు గ్రూపులు అయ్యాయి. మూడు వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించిన తర్వాత జి.విజయరామారావు కాంగ్రెస్‌లో చేరారు.
అప్పటి నుంచి కడియం శ్రీహరి, రాజయ్య వర్గాల మధ్య పోరు జరుగుతూనే ఉంది. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరిన కడియం శ్రీహరి... మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉండడంతో ఇటీవల రెండు వర్గాలు ఏకంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది.
వరంగల్ జిల్లాకు సంబంధించి 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు కావడంతో పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలోని 12 స్థానాల్లో ఏడు చోట్ల పోటీ చేసింది. కేవలం ఒకే ఒక స్థానం గెలుచుకుంది. రానున్న ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరికలు పెరిగిన నేపథ్యంలో నియోజకవర్గవర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి దారితీస్తాయోనని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.