తండ్రి చెంతకు ‘జంగిల్ ఉమన్’
నాంపెన్: జంగిల్ ఉమన్‌గా పేరొందిన వియత్నాం అమ్మాయి ఎట్టకేలకు తన తండ్రి వద్దకు చేరింది. రోచమ్ పి ఎన్ గ్యాంగ్ అలియాస్ టక్ అనే అమ్మాయి వెనుక పెద్ద కథే ఉంది. ఆ కథ ప్రకారం..వియత్నాం సరిహద్దుల్లోని కాంబోడియాలో ఒక గ్రామం. ఆ గ్రామంలోని రోచమ్ కుటుంబాలకు చెందిన పి ఎన్గ్యాంగ్ అనే అమ్మాయి, 1989లో అడవుల్లో గేదెలను మేపడానికి వెళ్లి తప్పిపోయింది. అనంతరం 2007లో నగ్నంగా, మట్టికొట్టుకుపోయి ఉన్న ఒక అమ్మాయి ఆ ఊళ్లోకి వచ్చింది. ఆమె 1989లో తప్పిపోయిన తమ కూతురేనని, 18 ఏళ్లు (1989-2007) అడవిలోనే బతికిందని భావించిన రోచమ్ కుటుంబం అప్పట్నుంచి ఆమెను పెంచుకుంటోంది.
2015లో ఆ కుటుంబం వారు జంగిల్ ఉమన్ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇవి చూసిన వియత్నాంకు చెందిన ఒక వ్యక్తి, ఆమె తన కూతురు టక్ అనీ, 2006లో తప్పిపోగా 2007లో మీకు దొరికిందని రోచమ్ కుటుంబం వద్దకు వచ్చాడు. టక్కు మతిస్థిమితం సరిగా లేదని చెప్పాడు. అందుకు సాక్ష్యంగా ఆమె చిన్ననాటి ఫోటోలను సైతం తీసుకొచ్చాడు. వీటిని పరిశీలించిన అధికారులు తాజాగా శనివారం నాడు టక్‌ను తన వియత్నాం తండ్రికి అప్పగించారు.
2007 నుంచి 2016 వరకు టక్ రోచమ్ కుటుంబం వద్ద పెరగడంతో ఆమెతో వారికి మంచి అనుబంధం ఏర్పడింది. 9 ఏళ్ల తర్వాత టక్ తమను వదిలి వెళ్లి పోతుంటే వారు ఉద్వేగానికి లోనై కంటనీరు కార్చారు. 1989లో తప్పిపోయిన అమ్మాయి జాడ మాత్రం ఇంకా తెలీలేదు. తమ సొంత కూతురు కనిపించకపోగా, 9 ఏళ్లు తమ ఇంట్లో పెరిగిన మరో కూతురు కూడా తమకు దూరం కావడం రోచమ్ కుటుంబంలో విషాదం నింపింది.