tv add
-
యాడ్ చూసి ఎత్తు పెరగాలనుకొంటే..
వనపర్తి: ఈ మందులు వాడితే సులభంగా పొడవు పెరగవచ్చు అంటూ టీవీలో ప్రసారమయ్యే ఓ యాడ్‌ను చూసిన ఆ యువకుడు రూ.2 వేలు వెచ్చించి గ్రోత్‌ఆన్ అనే మందుకొని వాడాడు. వారం రోజుల్లోనే.. శరీరమంతా ఇన్ఫెక్షన్ అయ్యింది. అలా రోజురోజుకు అనారోగ్యం పెరుగుతూనే వస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు సంస్థలు యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేసి సంస్థ ఉత్పత్తులను విక్రయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఖాజా నజీర్ అహ్మద్ ప్రస్తుతం అనుభవిస్తున్న నరకయాతనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంతో హుషారుగా ఉండే యువకుడు మూడుకాళ్ల వృద్ధుడిలా మంచానపడటంతో ఆ కుటుంబం పరిస్థితి దిక్కుతోచని సంకట స్థితిలోకి జారిపోయింది. గత రెండు నెలల క్రితం ప్రారంభమైన అనారోగ్యం ప్రస్తుతం తీవ్రరూపం దాల్చింది. శరీరంలోని కండ పూర్తిగా కరిగిపోయి ధృడమైన శరీర సౌస్టంతో ఉండాల్సిన పద్దెనిమిదేళ్ల యువకుడు ఎముకలగూడతో పలికేందుకు సత్తువలేనంత నీరసంగా మారిపోయాడు. అస్వస్థత ప్రారంభంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా.. అక్కడి వైద్యులు పదిహేనురోజులపాటు వైద్యం అందించి పాలమూరులోని ఎస్వీఎస్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి మందులు ఉచ్చారు. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైదరాబాద్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే.. ఆసరా పింఛన్, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే తల్లి కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్తులు పంచుకున్న బంధువులు ఆపద సమయంలో జాలి చూపించటం లేదు. పెద్ద మనస్సుతో సాయం చేసి నా కుమారుడి వైద్యం చేయించాలని తల్లి గోరీబీ, అక్క అర్షియా కోరుతున్నారు. -
చెక్కులు పంపిస్తామని.. చెక్కపొడి పంపించారు
బీర్కూర్ : టీవీ ప్రకటన చూసి ఓ వ్యక్తి మోసపోయాడు. గిఫ్టు పేరుతో 5 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మజీద్ అనే సైకిల్ మెకానిక్ ఓ టీవీ చానల్లో సినిమా చూస్తుండగా యాడ్ వచ్చింది. అందులో కనిపించీ కనబడనట్టుగా ఉన్న ఓ నటుడి ఫొటో (సల్మాన్‌ఖాన్)ను చూపించి గుర్తు పట్టండి, గిఫ్టు పట్టండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. మహ్మద్ మజీద్ వెంటనే స్పందించి ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పాడు. రెండ్రోజుల తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీరు సరైన సమాధానం చెప్పారు, టాటా సఫారీ వాహనం మీ సొంతం అంటూ మజీద్‌ను అభినందించి వివరాలు అడిగి తెల్సుకున్నాడు. కాగా రూ.13 లక్షల విలువ చేసే టాటా సఫారి వాహనం కావాలంటే వెంటనే తామిచ్చిన అకౌంట్లో రూ.15వేలు జమ జేయాలని చెప్పాడు. అంతడబ్బు తన వద్ద లేదని తనకు వాహనం బదులు నగదు చెల్లించాలని మజీద్ కోరాడు. దీంతో తాము పార్శిల్లో వజ్రాలహారం, చెక్కులు, ఐఫోన్, నగదు పంపిస్తామని రూ.5 వేల వరకు చెల్లించి తీసుకోవాలని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. చెప్పినట్లుగానే అందమైన పార్శిల్ పోస్టులో రావడంతో మజీద్ రూ.5 వేలు చెల్లించి తీసుకున్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి పార్శిల్ విప్పి చూడగా, అందులో చెక్కపోడి, ఓ కవరు కన్పించడంతో షాక్‌కు గురయ్యాడు.