బీర్కూర్ : టీవీ ప్రకటన చూసి ఓ వ్యక్తి మోసపోయాడు. గిఫ్టు పేరుతో 5 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మజీద్ అనే సైకిల్ మెకానిక్ ఓ టీవీ చానల్‌లో సినిమా చూస్తుండగా యాడ్ వచ్చింది. అందులో కనిపించీ కనబడనట్టుగా ఉన్న ఓ నటుడి ఫొటో (సల్మాన్‌ఖాన్)ను చూపించి గుర్తు పట్టండి, గిఫ్టు పట్టండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు.
మహ్మద్ మజీద్ వెంటనే స్పందించి ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పాడు. రెండ్రోజుల తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీరు సరైన సమాధానం చెప్పారు, టాటా సఫారీ వాహనం మీ సొంతం అంటూ మజీద్ను అభినందించి వివరాలు అడిగి తెల్సుకున్నాడు. కాగా రూ.13 లక్షల విలువ చేసే టాటా సఫారి వాహనం కావాలంటే వెంటనే తామిచ్చిన అకౌంట్‌లో రూ.15వేలు జమ జేయాలని చెప్పాడు. అంతడబ్బు తన వద్ద లేదని తనకు వాహనం బదులు నగదు చెల్లించాలని మజీద్ కోరాడు. దీంతో తాము పార్శిల్‌లో వజ్రాలహారం, చెక్కులు, ఐఫోన్, నగదు పంపిస్తామని రూ.5 వేల వరకు చెల్లించి తీసుకోవాలని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. చెప్పినట్లుగానే అందమైన పార్శిల్ పోస్టులో రావడంతో మజీద్ రూ.5 వేలు చెల్లించి తీసుకున్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి పార్శిల్ విప్పి చూడగా, అందులో చెక్కపోడి, ఓ కవరు కన్పించడంతో షాక్‌కు గురయ్యాడు.
చెక్కులు పంపిస్తామని.. చెక్కపొడి పంపించారు
Published Tue, Feb 16 2016 10:33 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
Advertisement
Advertisement