TV ramarao
-
టీడీపీలో వలసలే సంకేతాలు..!
సాక్షి, అమరావతి : ఎన్నికల ముందు అధికార పార్టీ టీడీపీ నుంచి నాయకుల వలసలు పెరగడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుంటున్న నేతలంతా పలు సామాజిక వర్గాలతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను ప్రభావితం చేయగలిగిన నేతలే. వీరిలో సర్పంచుల నుంచి సిట్టింగ్ ఎంపీల వరకూ ఉన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్యెల్యేలు వరుసగా వైఎస్సార్సీపీలోకి చేరడం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వేగంగా మారుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంవైపు నేతలు అడుగులు వేయలేదని విశ్లేషకులు అంటున్నారు. వాడుకుని వదిలేసే చంద్రబాబు వైఖరితో విసుగెత్తిన ప్రజాప్రతినిధులంతా మునిగిపోయే నావ టీడీపీ నుంచి బయటపడుతున్నారని పేర్కొంటున్నారు. అధికార పార్టీలో కలవరం.. తాజా పరిణామాలు టీడీపీ అధినేతకు, అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అనుకూల పవనాలు వీస్తుండడమే నిరంతర చేరికలకు కారణమని టీడీపీ అధినేత తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రతో మొదలైన వలసలు ఎన్నికల నామినేషన్లు ముగిసేనాటికి పతాకస్థాయికి చేరుకున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం, టీడీపీని ప్రముఖ నేతలు వీడుతుండటం రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారనేందుకు సంకేతమని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. ‘తూర్పు’లో ప్రకంపనలు... తూర్పు గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిచిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న నానుడి ఉంది. ఈ జిల్లాలో వైఎస్సార్సీపీలోకి భారీ వలసలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్, మరో ముగ్గురు ప్రముఖ నాయకులు కూడా అధికార పార్టీని వీడటం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీలో చేరిన కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహానికి పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ఆయన భార్య తోట వాణి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె. టీడీపీని వీడిన మరో సిట్టింగ్ ఎంపీ (అమలాపురం) పండుల రవీంద్రకు అన్ని వర్గాలతో సత్సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పర్వత బాపనమ్మకు ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టుంది. రాజమండ్రికి చెందిన శివరామ సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్, కేబుల్ టీవీ అధినేత. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఆయన రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లోని 5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. పర్వత రాజబాబు, బెజవాడ సత్యనారాయణలు ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ సెగ్మెంట్లలో బలమున్న నేతలు. ‘కొత్తపల్లి’ నిర్ణయంతో మారిన సమీకరణాలు పశ్చిమ గోదావరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ షేక్ నూర్జహాన్ వైఎస్సార్సీపీలో చేరారు. రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పలువురితో బంధుత్వాలు, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రభావం చూపగల నేత. మాజీ ఎమ్మెల్యేలు మద్దాల సునీత, మోచర్ల జవహర్వతిలకు గట్టి వర్గం ఉంది. ఏలూరు మేయరు షేక్ నూర్జహాన్‌కు బలహీనవర్గాల్లో మంచి గుర్తింపుతోపాటు వ్యాపార వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. తాజాగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు బలమైన నాయకుడు, వివాదరహితుడు. కాపు సామాజికవర్గంతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు గట్టి వర్గం ఉంది. సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నవీన్ జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన అనకాపల్లి టీడీపీ సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్, దాడి వీరభద్రరావుకు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలరు. విశాఖనుంచి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామికి కాళింగి సామాజికవర్గంలో విస్తృత సంబంధాలతోపాటు రాజకీయంగా పట్టు ఉంది. టీడీపికి చెందిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చేరారు. మోహన్ బాబు చేరికతో.. సినీ నటుడు, నిర్మాత, విద్యా సంస్థల అధికేత మంచు మోహన్‌బాబు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వెంట హీరో మంచు విష్ణుకూడా ఉన్నారు. తెలుగా రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్, అభిమానులున్న మోహన్‌బాబు చేరికతో చిత్తూరుజిల్లాలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీచేసిన ఇక్బాల్ అహ్మద్, తంబళ్లపల్లినుంచి ’కొండా’ ఫ్యామిలీ గతంలోనే వైఎస్సార్సీపీలో చేరారు. – యర్రా యోగేశ్వరరావు, ఎలక్షన్ డెస్క్ -
గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్
-
టీడీపీకి ఝలక్ .. టీవీ రామారావు రాజీనామా
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలిరోజే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికులకు కాకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు టికెట్ ఇవ్వడంపై టీవీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు టికెట్‌ను తన కూతురికి కేటాయించాలని చంద్రబాబును టీవీ కోరారు. కానీ చంద్రబాబు ఆమెను కాదని అనితకు ఇచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన టీవీ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని రామారావు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులతో సమావేశమయ్యారు. గుంటూరులోనూ అదే పరిస్థితి గుంటూరు జిల్లా టీడీపీలోనూ అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మాచర్ల టికెట్‌ను అంజిరెడ్డికి ప్రకటించడం పట్ల చలమారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్టీ ఆఫీసు వద్ద చలమారెడ్డి వర్గం ధర్నాకు దిగారు. చలమారెడ్డి ముద్దు.. అంజిరెడ్డి వద్దూ అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని, కొత్తవారికి టికెట్ ఇవ్వడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులకు నచ్చని అభ్యర్థిని ప్రకటిస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు.ఇక కర్నూలు జిల్లా బనగాణపల్లేలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఓటమి భయంతో బీసీ వెనుకంజ వేస్తున్నారు. బీజీ జనార్దన్ రెడ్డి సొంతగ్రామంలో 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. -
నర్సింగ్ కాలేజీలో దారుణాలకు పాతర
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేపై విచారణకు తెర సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై నమోదైన కేసును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన కళాశాలలో విద్యనభ్యసించడానికి వచ్చిన కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆయనపై ఆరోపణలన్నాయి. మహిళల ఆత్మాభిమానానికి భంగం కలిగేలా దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణల కింద నిడదవోలు పోలీసు స్టేషన్లో రామారావుపై 2009లో కేసులు నమోదయ్యాయి. నిడదవోలులో ఉన్న టీవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలోని స్పృహ నర్సింగ్ కాలేజీలో వరుస దారుణాలు జరిగినట్లు 2009 జూన్ 18న వెలుగులోకి వచ్చింది. ఆరోజు రాత్రి కళాశాల హాస్టల్లో కలకలం రేగడం, మేడపైనున్న వాటర్ ట్యాంక్ వద్ద దాక్కున్న టీవీ రామారావును స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు మీడి యా సమక్షంలో పట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి నాలుగు రోజుల ముందు ఆ కళాశాలలో చదువుతున్న కేరళ నర్సింగ్ విద్యార్థినితో రామారావు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు, అడ్డుకోబోయిన మరో విద్యార్థినిపై దాడికి ప్రయత్నించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో విద్యార్థినులు నాటి హోంమంత్రికి ఫిర్యాదు చేయగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రామారావుపై కేసు ఉపసంహరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు 2009లో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రామారావుపై కేసు నమోదు చేశారు. -
టీడీపీలో ప్రజాస్వామ్యం లేదు
తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం అన్నది లేనే లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి పట్టున్న చోట్ల కూడా సరైన నాయకులకు టికెట్లివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మొత్తం ఇప్పుడు కార్పొరేట్ సిండికేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా తన గెలుపు ఖాయమన్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీ మోహన్‌ను ఓడిస్తానని గతంలోనే చెప్పిన రామారావు, ఇప్పుడు నేరుగా పార్టీ అధిష్ఠానంపైనే విమర్శలకు దిగారు. గెలుపుతోనే తన ప్రత్యర్ధులకు సమాధానం చెబుతానన్నారు. -
'టీవీ'కి మిగిలింది అరగుండే
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకు 'అరగుండే' మిగిలింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఖరారులో మొండిచేయి చూపించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకున్న రామారావును పక్కనపెట్టి చివరి నిమిషంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి అధినేత షాక్ ఇచ్చారు. పార్టీ తరపున సమైక్యాంధ్ర కోసం టీవీ రామారావు అరగుండు గీయించుకున్నారు. ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్లీ టికెట్ అనుకుని నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. అయితే అనుకున్నదొకటీ... అయినది ఒక్కటి అన్నట్లు అయితే చివరి నిమిషంలో చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని ప్రయోగించి టీవీని సైకిల్ దించేశారు. గత ఎన్నికల్లో 15,500 ఓట్లకు పైబడి మెజారిటీ సాధించిన రామారావు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో రామారావుకు టికెట్ కేటాయించకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు పార్టీలో ఎంతోకాలం నుంచి ఉన్న నాయకులను కాదని కొత్త వ్యక్తి జవహర్‌కు సీటు కేటాయింపుపై టీడీపీ నేతలు అధినేతపై గుర్రుగా ఉన్నారు. టీవీ టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తికి గురైన ఆయన అనుచరులు తాళ్ళపూడి మండలం పెద్దేవంలో నిరసనలకు దిగారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉండాలని టీవీ రామారావు మద్ధతుదారులు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో రామారావు శనివారం కొవ్వూరులో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. సమావేశం తరువాతే రెబల్‌గా రంగంలోకి దిగాలా, వద్దా అనేది నిర్ణయించుకోన్నట్లు సమాచారం. అయితే బరిలో ఉండేందుకే అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి.