'టీవీ'కి మిగిలింది అరగుండే
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకు 'అరగుండే' మిగిలింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఖరారులో మొండిచేయి చూపించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకున్న రామారావును పక్కనపెట్టి చివరి నిమిషంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి అధినేత షాక్ ఇచ్చారు.
పార్టీ తరపున సమైక్యాంధ్ర కోసం టీవీ రామారావు అరగుండు గీయించుకున్నారు. ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్లీ టికెట్ అనుకుని నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. అయితే అనుకున్నదొకటీ... అయినది ఒక్కటి అన్నట్లు అయితే చివరి నిమిషంలో చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని ప్రయోగించి టీవీని సైకిల్ దించేశారు.
గత ఎన్నికల్లో 15,500 ఓట్లకు పైబడి మెజారిటీ సాధించిన రామారావు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో రామారావుకు టికెట్ కేటాయించకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు పార్టీలో ఎంతోకాలం నుంచి ఉన్న నాయకులను కాదని కొత్త వ్యక్తి జవహర్‌కు సీటు కేటాయింపుపై టీడీపీ నేతలు అధినేతపై గుర్రుగా ఉన్నారు.
టీవీ టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తికి గురైన ఆయన అనుచరులు తాళ్ళపూడి మండలం పెద్దేవంలో నిరసనలకు దిగారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉండాలని టీవీ రామారావు మద్ధతుదారులు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో రామారావు శనివారం కొవ్వూరులో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. సమావేశం తరువాతే రెబల్‌గా రంగంలోకి దిగాలా, వద్దా అనేది నిర్ణయించుకోన్నట్లు సమాచారం. అయితే బరిలో ఉండేందుకే అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి.