Two Software Engineers died
-
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల దుర్మరణం
టిప్పర్‌ను ఢీకొన్న బైకు అతివేగంతోనే ప్రమాదం గచ్చిబౌలి : అతివేగం ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఉసురు తీసింది. యూ టర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను బైకు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... ఖాన్పూర్కు చెందిన అమోద్‌సింగ్(27) వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటుండగా... లక్నోకు చెందిన పూజాసింగ్(26) గోల్కొండలోని మిలటరీ ఆసుపత్రి ఎదురుగా నివాసం ఉంటోంది. ఇద్దరూ అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. శనివారం సెలవు కావడంతో స్నేహితులు నేహా మిట్టల్, అభిషేక్‌లతో కలిసి బైకులపై చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్లి.. సాయంత్రం తిరిగి వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని క్రీమ్‌స్టోన్‌లో ఐస్‌క్రీం తిని తిరిగి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నేహా ఇంటికి బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న అమోద్‌సింగ్ బైక్ రాత్రి 10.50 గంటలకు గచ్చిబౌలిలోని మైక్రోసాప్ట్ గేట్-1 ఎదురుగా యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమోద్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలకు గురైన పూజాసింగ్ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ కొద్ది గంటల్లోనే మృతి చెందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సౌమ్యదీప్కు లుకౌట్ నోటీసులు జారీ
-
సోమదీప్‌కు లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం కూకట్పల్లి ప్రగతి నగర్ కారు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కారు నడిపిన సోమదీప్ బసు అమెరికాకు పరారీ అయ్యాడు. దాంతో పోలీసులు అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుదీప్ (26), ఉత్యా (23), సౌరవ్ మైథీ (30), నిలాద్రి (29)లు కొండాపూర్‌లో నివాసముంటున్నారు. సుదీప్ , ఉత్యా, సౌరవ్లు సాప్ట్వేర్ ఇంజనీర్లు కాగా... నిలాద్రి ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. బాచుపల్లిలో ఉండే తన స్నేహితుడు బసు శుక్రవారం రాత్రి విందు ఇస్తానంటే నలుగురూ కారులో వెళ్లారు. విందు ముగించుకొని శనివారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ప్రగతినగర్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సుదీప్, ఉత్యా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలకు గురైన సౌరవ్, నిలాద్రిలను పోలీసులు కేపీహెచ్‌బీ కాలనీలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తన అమెరికా ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రమాదం జరిగిన సమయంలో సుదీప్ కారును నడిపినట్లు సోమదీప్ పోలీసులను తప్పుదారి పట్టించాడు. సుదీప్ చనిపోవటంలో ఆ నేరం తనపైకి రాదని భావించాడు. అయితే పోలీసులు లోతుగా విచారణ జరపటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సోమదీప్ కోసం గాలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రగతి నగర్లో శనివారం తెల్లవారుజామున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు సుదీప్, ఇట్యాగాలుగా పోలీసులు గుర్తించారు. నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో వారిరువురు ఇంజినీర్లుగా పని చేస్తున్నారన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వారి మృతదేహలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.