టిప్పర్‌ను ఢీకొన్న బైకు
అతివేగంతోనే ప్రమాదం
గచ్చిబౌలి : అతివేగం ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉసురు తీసింది. యూ టర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను బైకు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... ఖాన్‌పూర్‌కు చెందిన అమోద్‌సింగ్(27) వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటుండగా... లక్నోకు చెందిన పూజాసింగ్(26) గోల్కొండలోని మిలటరీ ఆసుపత్రి ఎదురుగా నివాసం ఉంటోంది.
ఇద్దరూ అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. శనివారం సెలవు కావడంతో స్నేహితులు నేహా మిట్టల్, అభిషేక్‌లతో కలిసి బైకులపై చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్లి.. సాయంత్రం తిరిగి వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని క్రీమ్‌స్టోన్‌లో ఐస్‌క్రీం తిని తిరిగి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నేహా ఇంటికి బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న అమోద్‌సింగ్ బైక్ రాత్రి 10.50 గంటలకు గచ్చిబౌలిలోని మైక్రోసాప్ట్ గేట్-1 ఎదురుగా యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అమోద్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలకు గురైన పూజాసింగ్‌ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ కొద్ది గంటల్లోనే మృతి చెందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల దుర్మరణం
Published Sun, May 10 2015 11:48 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement