Two years to complete
-
అరుణగ్రహంపై రెండేళ్లు...
అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న నాసా క్యూరియాసిటీ రోవర్ మంగళవారం నాటికి మార్స్‌పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. రోదసిలో దాదాపు 9 నెలలు ప్రయాణించి ఆగస్టు 5, 2012న మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో వాలిపోయిన క్యూరియాసిటీ ఈ రెండేళ్లలో ఆ గ్ర హం గురించి ఎన్నో వివరాలను భూమి కి పంపింది. అంగారకుడి మట్టి, శిలలపై లేజర్లను ప్రయోగించి వాటిలోని ఖనిజాలు, రసాయనాల వివరాలు సేకరించింది. ఒకప్పుడు అక్కడ సూక్ష్మజీవుల ఉనికికి అనుకూలమైన వాతావరణం ఉండేదా? అన్న కోణంలో పరిశోధించింది. ఎల్లోనైఫ్ బే అనే ప్రాంతంలో గతంలో నీరు పెద్ద ఎత్తున ప్రవహించిందని గుర్తించింది. అక్కడ ఒకప్పుడు ఉన్న మంచినీటి సరస్సు ఆనవాళ్లనూ కనుగొంది. గేల్‌క్రేటర్ మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ షార్ప్ పర్వతం దిశగా సాగుతున్న రోవర్ మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోనుంది. అయితే మౌంట్ షార్ప్‌కు చెందిన పర్వతపాదం 500 మీటర్ల దూరంలోనే ఉందని, క్యూరియాసిటీ అక్కడికి చేరితే చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
రాష్ట్రపతిగా ప్రణబ్‌కు రెండేళ్లు!
రాష్ట్రపతి భవన్లో మ్యూజియం ప్రారంభం న్యూఢిల్లీ: శుక్రవారం నాటికి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం జూలై 25న పదవి చేపట్టిన ప్రణబ్.. ఆ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ఒక ప్రదర్శనశాలను శుక్రవారం ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతుల ఫైబర్ గ్లాస్ ప్రతిమలు, విదేశీ పర్యటనల సందర్భంగా వారు బహుమతులుగా స్వీకరించిన కళాఖండాలు కొలువుతీరిన ఆ మ్యూజియం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘వింగ్డ్ వండర్స్’ అనే పుస్తకాన్ని, రాష్ట్రపతి భవన్లో 2012, ఆగస్టు నుంచి జరిగిన సంగీత, నృత్య కార్యక్రమాల సమాహారమైన ‘ఇంద్రధనుష్’ అనే మరో పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించారు. చరిత్రకు ప్రాధాన్యతనిచ్చే దేశంగా భారత్ మారాలని మోడీ పిలుపునిచ్చారు. తమ చరిత్రను మరచిపోయే దేశాలు.. చరిత్ర సృష్టించే సామర్ధ్యాన్ని కోల్పోతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ తనకు దిశానిర్దేశం చేస్తున్నారని మోడీ ప్రశంసించారు.