మార్కెట్లోకి యమహా ఏరాక్స్ 155 కొత్త వెర్షన్ @ 1,42 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా ఏరాక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్ 2023 వెర్షన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1,42,800 ఉంది. ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా 155 సీసీ ఇంజన్ పొందుపరిచింది.
ఎల్ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, మొబైల్ చార్జింగ్ కోసం పవర్ సాకెట్, 24.5 లీటర్ల స్టోరేజ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, 14 అంగుళాల అలాయ్ వీల్స్, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్తోపాటు స్కూటర్లలో తొలిసారిగా ఈ మోడల్‌కు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్15ఎస్, ఎంటీ15 వీ2, ఆర్15 వీ4 మోడళ్లలో 2023 వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.63–1.86 లక్షల మధ్య ఉంది.
కాఫీడే రూ.436 కోట్ల రుణాల ఎగవేత
న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం.