అక్కడ.. ఈ దుస్తులు ధరించకండి
పాశ్చాత్య దేశాలకు వెళ్లినపుడు సంప్రదాయ అరబ్ దుస్తులను ధరించవద్దని యూఏఈ తమ దేశ పౌరులకు సూచించింది. విదేశాలకు ప్రయాణించినపుడు, ముఖ్యంగా విదేశాల్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్లినపుడు సంప్రదాయ దుస్తులు ధరించవద్దని యూఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. యూఏఈ పౌరుల భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అమెరికాకు వెళ్లిన ఎమిరేట్స్ వ్యాపారవేత్తను జిహాదిగా భావించి యూఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో యూఏఈ హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికాకు వైద్య చికిత్స కోసం వెళ్లిన యూఏఈ వ్యాపారవేత్త అహ్మద్ అల్ మెన్హలి (41) క్లీవ్‌లాండ్‌లోని ఓ హోటల్లో బసచేశారు. తెల్లటి అరబ్ దుస్తుల్లో ఉన్న ఆయనను హోటల్ సిబ్బంది జిహాదిగా అనుమానించారు. అంతేగాక ఐఎస్ ఉగ్రవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నారని సందేహించారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. సాయుధులైన పోలీసులు అహ్మద్ అల్ మెన్హలిని అదుపులోకి తీసుకుని కొట్టారు. దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. అహ్మద్ అల్ మెన్హలికి ఐసిస్‌తో సంబంధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఆయనను వదలిపెట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, తాను తీవ్రంగా గాయపడ్డానని అహ్మద్ అల్ మెన్హలి చెప్పారు.