షాకింగ్: కాళ్లతో తన్ని.. బెల్టులతో కొట్టి!
భోపాల్: గో సంరక్షకుల పేరుతో దేశంలో రోజురోజుకు హింస పెరిగిపోతుంది. ఈ దాడులను అరికట్టడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కబేళాలను మూసేయడంతో వీటికి ఆజ్యం పోసినట్లయింది. గోరక్షకుకులు చేసే దాడులలో కొన్ని సందర్భాలలో అమాయకుల ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ విచారకర ఘటన వెలుగుచూసింది. పదికి పైగా గోరక్షకులు ఓ వ్యక్తిని కాళ్లతో తన్ని, బెల్టులతో చితకబాదారు. ఈ వీడియో చూసినట్లయితే.. బాధితుడిపై దాడి జరిగిన తీరు ఎంత దారుణమో తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.
గో రక్షకులంటూ చెప్పుకుని వాళ్లు చేసిన దాడిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు చోద్యం చూశారే తప్ప ఆపాలని చూడకపోవడం గమనార్హం. 'నన్ను కొట్టవద్దు.. నాకే పాపం తెలియదు. నన్ను వదిలిపెట్టండి' అంటూ ప్రాధేయపడ్డా వారి మనసు కరగలేదు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పది మంది యువకులు గుర్తుతెలియని వ్యక్తిని రోడ్డుపై విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ వీడియో ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసిన ఉజ్జయిని పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.