ఆఫీసుకు వెళ్ళేందుకు విమానం చేశాడు..!
ప్రతిరోజూ కారులో ఆఫీసుకు వెళ్ళే డ్రైవింగ్ సమయానికి అతడు విసిగిపోయాడు. తన ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలంటే ఏంచేయాలో ఆలోచించాడు. తనకు చిన్నతనంనుంచే ఇష్టమైన విమానాల తయారీపై దృష్టిసారించి, స్వంతగా ఓ విమానాన్నే తయారు చేసుకున్నాడు.
చెక్ రిపబ్లిక్ కు చెందిన 45 ఏళ్ళ ఫ్రాంటిసెక్ అడ్వారా కాస్త వినూత్నంగా ఆలోచించాడు. తాను ఆఫీసుకు వెళ్ళే 14 నుంచి 15 నిమిషాల ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు స్వంతగా విమానాన్ని తయారు చేసుకున్నాడు. ట్రాఫిక్ జాముల్లో దగ్గరలో ఉన్న కార్యాలయాలకు చేరడమే కష్టమయ్యే నగరాలతో పోలిస్తే ఆయన ప్రయాణం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఉదయం 6 గంటల షిఫ్టుకు.. ఇంటినుంచీ కారులో ఆఫీసుకు వెడితే 14 నిమిషాలు పడుతుందట. అయితేనేం ఆ సమయాన్నే తగ్గించాలనుకున్న ఫ్రాంటిసెక్.. స్వయంగా విమానం రూపొందించాడు.
నైరుతి చెక్ లోని జ్డికోవ్ గ్రామానికి చెందిన ఫ్రాంటిసెక్ అక్కడికి దగ్గరలోని డ్రెవోస్ట్ రోజ్ పట్టణంలోని ఓ కర్మాగారంలో ఉదయం 6 గంటల షిష్టుకు వెళ్ళాల్సి వచ్చేది. ఆ సమయంలో 14 నిమిషాల ప్రయాణాన్నే ఆయన చాలా ఎక్కువగా భావించడంతో.. తన ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు రెండు సంవత్సరాలు కష్టపడి అల్ట్రా లెట్ ఆధారిత ఆమెరికా డిజైన్ కు చెందిన మిని-మాక్స్ విమానాన్ని రూపొందించాడు. వాతావరణం అన్ని విధాలుగా అనుమతిస్తే తాను రూపొందించిన విమానంలో కేవలం 7 నిమిషాల్లోనే ఆఫీసుకు చేరుకోవచ్చని చెప్తున్నాడు.
మూడు సిలిండర్లతో నడిచే ఇంజిన్ తో పాటు, చెక్కను ఉపయోగించి ఈ విమానాన్ని తయారు చేశాడు. దీనికి సుమారు 2,75,000 రూపాయలు ఖర్చు చేశాడు. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానానికి ఆరు లీటర్ల పెట్రోలు ఖర్చవుతుంది. సమయం వృధా కాకుండా ఉండేందుకు చేసిన ఫ్రాంటిసెక్ ఆలోచనను కంపెనీ యాజమాన్యం, తోటి ఉద్యోగులు అభినందించారు. ఫ్రాంటిసెక్ పదేళ్ళ వయసులో ఓల్డ్ వార్ విమానాలపై వచ్చిన ఓ టీవీ డాక్యుమెంటరీని చూసి, అప్పటినుంచే విమానాల ప్రేమలో పడిపోయాడు. చివరికి తన కల సాకారం చేసుకున్నాడు.