Umpire Asad Rauf
-
క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం
క్రికెట్లో విషాదం నెలకొంది. ఐసీసీ మాజీ అంపైర్ పాకిస్తాన్‌కు చెందిన అసద్ రౌఫ్(66) గుండెపోటుతో కన్నుమూశారు. 66 ఏళ్ల అసద్ రౌఫ్ అంతర్జాతీయ క్రికెట్లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ నిర్వహించారు. ఇందులో 64 టెస్టులు( 49 టెస్టులు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా.. 15 మ్యాచ్‌లు టీవీ అంపైర్‌గా), 139 వన్డేలు, 28 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి అలీమ్ దార్ తర్వాత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అసద్ రౌఫ్ ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా పనిచేశాడు. అయితే 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అసద్ రౌఫ్ మెడకు చుట్టుకుంది. అసద్ రౌఫ్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. బుకీల నుంచి అసద్ రౌఫ్ ఖరీదైన బహుమతుల్ని స్వీకరించి.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బీసీసీఐ అతడ్ని పక్కన పెట్టి విచారణకి ఆదేశించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసినప్పటికి అంపైర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. బీసీసీఐ ఇచ్చిన షాక్‌కు అంపైరింగ్ వదిలేసిన అసద్ రౌఫ్ లాహోర్‌లోనే ఒక బట్టల షాపు నిర్వహించడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: గంగూలీ, జై షాలకు జై -
అంపైర్ రవూఫ్‌పై ఐదేళ్ల నిషేధం
ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల నిషేధం విధించింది. బోర్డు క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్లో బుకీల నుంచి విలువైన బహుమతులను తీసుకుని మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను తెలిపినట్టు 59 ఏళ్ల రవూఫ్‌పై ఆరోపణలు వచ్చాయి. ‘అంపైర్ విధుల నుంచే కాకుండా బీసీసీఐకి సంబంధించి ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నాం’ అని బోర్డు పేర్కొంది. తనపై వచ్చిన ఆరోపణలపై ఈనెల 8న అతడు రాతపూర్వక సమాధానమిచ్చినట్టు తెలిపింది. మరోవైపు ఈ నిషేదంపై రవూఫ్ స్పందించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ‘నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ముంబై కోర్టు గతంలోనే పోలీసులకు చెప్పింది. మరి వీరు ఏ అధికారంతో నన్ను నిషేధించారు? కమిటీ విచారణకు నా లాయర్లతో పాటు వస్తానని చెప్పినా ఒక్కడినే రమ్మని ఒత్తిడి చేశారు. అందుకే వెళ్లలేదు. కరాచీ, దుబాయ్‌లో కలుస్తానని చెప్పినా వారు అంగీకరించలేదు. ఈ నిషేధంపై బీసీసీఐకి నోటీసు ఇస్తాను. అసలు వారికి ఆ అధికారమే లేదు’ అని రవూఫ్ అన్నారు.