ఆదాయం పెంచండి: మంత్రి ఈటెల
సాక్షి, హైదరాబాద్: నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆదాయాన్ని ఖజానాకు సమకూర్చాల్సిందేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రవాణా, భూగర్భ గనుల శాఖలు ఆశించిన మేరకు ఆదాయాన్ని రాబట్టలేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోడానికి మరింత కష్టపడి పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారని, వీటిని నెరవేర్చడానికి ప్రధాన ఆదాయ వనరుల శాఖలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, భూగర్భ గనుల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో మంత్రి ఈటెల సమీక్ష జరిపారు.