University of Madras
-
Varatha Shanmuganathan: వరతమ్మా నీకు వందనాలమ్మా!
‘ఈ వయసులో చదువు ఏమిటి!’ అనుకునేవాళ్లు ఒక్కసారి వరత షణ్ముగనాథన్ గురించి చదివితే– ‘అవును. నాకు కూడా చదువుకోవాలని ఉంది’ అని బలంగా అనుకుంటారు. చదువుకు ఉన్న బలం అదే! కెనడాలోని ‘యార్క్ యూనివర్శిటీ’ నుంచి 87 సంవత్సరాల వయసులో మాస్టర్స్ డిగ్రీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది వరత షణ్ముగనాథన్. విద్యారంగంలో ఆమె స్ఫూర్తిదాయకమైన కృషిని గుర్తించి గౌరవించింది ఆంటేరియో లెజిస్లేచర్ అసెంబ్లీ. షణ్ముగనాథన్ హాలులోకి అడుగు పెడుతున్న సమయంలో సభ్యులు లేని నిల్చొని జయజయధ్వానాలు చేశారు. ‘ఈ తరానికి ఎన్నో రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే మహిళ’ అంటూ షణ్ముగనాథన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు అసెంబ్లీ సభ్యులు. షణ్ముగనాథన్ కెనడాకు వెళ్లిన సమయంలో సీనియర్స్‌కు ‘యార్క్ యూనివర్శిటీ’లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుసుకొని ఎంతో సంతోషించింది. అలా మాస్టర్స్ ప్రోగ్రాంలో భాగం అయింది. కూతురు ఎంతోప్రో త్సాహకంగా నిలిచింది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’లో డిగ్రీ చేసిన షణ్ముగనాథన్ ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ చేసేనాటికి ఆమె వయసు యాభై సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వరత షణ్ముగనాథన్ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చి వైరల్‌గా మారింది. షణ్ముగనాథన్‌ను ప్రశంసిస్తూ అన్ని వయసులవారి నుంచి కామెంట్స్ వచ్చాయి. మచ్చుకు కొన్ని.... ‘కాస్త వయసు పైబడగానే ఈ వయసులో ఏం నేర్చుకుంటాం అనే నిర్లిప్తత చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వారిలో మార్పు తీసుకువచ్చే విజయం ఇది’ ‘నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. ఏదైనా చేయాలి...అని ఆలోచించేవాడిని. అంతలోనే ఈ వయసులో ఏం చేస్తాములే అని వెనక్కి వెళ్లేవాడిని. వరతమ్మ వీడియో చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆమెలాగే నేను కూడా చదువుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను’ చదువు ఎప్పుడూ మనల్ని చురుగ్గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి బలహీనం కాకుండా చూస్తుంది. చదువుకు వయసుతో సంబంధం లేదు. -
Mallika Srinivasan: ట్రాక్టర్ మహారాణి
విజయానికి వయసు అడ్డు పడుతుందా? వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని చెబుతూ తమను తాము నెంబర్ వన్‌గా నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. ‘మహిళలకు పరిమితులు ఉన్నాయి’ అంటూ ఎక్కడైనా అడ్డుగోడలు ఎదురొచ్చాయా? ఆ అడ్డుగోడలను బ్రేక్ చేసి, కొత్త మార్గం వేసి దూసుకుపోయి తమను తాము నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. తమ శక్తియుక్తులతో భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఫోర్బ్స్ ‘50 వోవర్ 50: ఆసియా 2022’లో మెరిసిన మహిళా మణులలో మన మల్లికా శ్రీనివాసన్ ఉన్నారు. మల్లికా శ్రీనివాసన్... అనే పేరుతో పాటు కొన్ని విశేషణాలు కూడా సమాంతరంగా ధ్వనిస్తాయి. అందులో ముఖ్యమైనవి... ‘ట్రాక్టర్ క్వీన్’ ‘మోస్ట్ పవర్ఫుల్ సీయివో’ ట్రాక్టర్ ఇండస్ట్రీని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా చెబుతారు. అలాంటి ఇండస్ట్రీలో విజయధ్వజాన్ని ఎగరేఓఆరు. కంపెనీని ప్రపంచంలో మూడో స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలిపారు. ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారుగానీ అది అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మల్లికకు చిన్న వయసు నుంచే వ్యాపార విషయాలపై ఆసక్తి. తనకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ‘ఇది ఏ రాగం?’ అని కమనీయమైన రాగాల గురించి తెలుసుకోవడంలో ఎంత ఆసక్తో, జటిలమైన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంపై కూడా అంతే ఆసక్తి ఉండేది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’ నుంచి ‘ఎకనామెట్రిక్స్’లో గోల్డ్‌మెడల్ అందుకున్న మల్లిక ప్రతి విజయం వెనుక కొన్ని ‘గోల్డెన్ రూల్స్’ ఉంటాయని బలంగా నమ్ముతారు. ఆ సూత్రాలు పుస్తకాల్లో తక్కువగా కనిపించవచ్చు. సమాజం నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి రావచ్చు. చదువుల్లో ఎప్పుడూ ముందుండే మల్లిక పుస్తకాల్లో నుంచి ఎంత నేర్చుకున్నారో, సమాజం నుంచి అంతకంటే ఎక్కువ నేర్చుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టారు. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టఫే–(చెన్నై) లో జనరల్ మేనేజర్‌గా మొదలయ్యారు మల్లిక. ఆ తరువాత చైర్పర్సన్ అయ్యారు. జనరల్ మేనేజర్ నుంచి చైర్పర్సన్ వరకు ఆమె ప్రస్థానంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయితే జటిలమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుక్కోవడంలో ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని అడిగితే ఆమె చెప్పే సమాధానం... ‘నాకో మంచి ట్రాక్టర్ కావాలి...అనుకునే ప్రతి రైతు మొదట మా ట్రాక్టర్ వైపే చూడాలి’ కేవలం వ్యాపార విషయాల గురించి మాత్రమే కాకుండా సమాజసేవపై కూడా దృష్టి పెడుతుంటారు మల్లిక. పేదలకు వైద్యం అందించే వైద్యసంస్థలు, విద్యాసంస్థలకు ఆర్థికసహాయాన్ని అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను నెరవేరుస్తున్నారు. -
1813లోనే మొదటి స్కూల్
నగరంలో ఏర్పాటైన మొదటి స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. 1813లోనే దీన్ని స్థాపించారు. 1869లోనే సివిల్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించడం విశేషం.. 1872లో నిర్మించిన మదర్సా-ఐ-అలియా స్కూలు అప్పట్లో ఎంతో పేరుపొందింది. 1872 నాటికి హైదరాబాద్‌లో 16 ప్రభుత్వ స్కూళ్లు ఉండేవి... తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లిషు బోధించేవారు. 1887లో హైదరాబాద్ స్కూల్, మదర్సా -ఐ-అలియాను కలిపి నిజాం కాలేజీగా మార్చారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలో ఈ కాలేజీ పనిచేసేది. -
కలకలం రేపిన విద్యార్థి
ఆత్మాహుతి యత్నం మద్రాసు వర్సిటీలో ఉద్రిక్తత గంటన్నర సాగిన హైడ్రామా సాక్షి, చెన్నై: మద్రాసు వర్సిటీలో ఓ విద్యార్థి బుధవారం కలకలం సృష్టించారు. వర్సిటీ భవనంపై అంతస్తుకు చేరి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే యత్నం చేశాడు. ఉత్కంఠ భరిత వాతావరణంలో గంటన్నర పాటుగా సాగిన హైడ్రామాకు పోలీసులు ముగింపు పలికారు. మద్రాసు వర్సిటీలో ఇటీవల కొం దరు విద్యార్థుల తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. వీరికి మణివన్నన్ అనే ప్రొఫెసర్ అండగా నిల బడారని చెప్పవచ్చు. అయితే, వీరి ఆందోళనను తీవ్రంగా పరిగణించిన వర్సిటీ వర్గాలు పది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఆ ప్రొఫెసర్‌పై చర్యలు సైతం తీసుకున్నారు. అయితే, తమ డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..? అంటూ వర్సిటీ వర్గాలను విద్యార్థులు నిలదీశారు. వారి నుంచి స్పందన కరువు కావడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం విద్యార్థులకు అండగా నిలబడ్డా, వారిని మళ్లీ వర్సిటీలోకి చేర్చుకునేందుకు అధికారులు చర్యలు చేపట్ట లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సస్పెండ్ కాబడ్డ వారిలో ఒకరైన రాజ్‌కుమార్ అనే వి ద్యార్థి ఆత్మాహుతి యత్నానికి సిద్ధమయ్యాడు. వర్సిటీ వర్గాల కళ్లు గప్పి, బహుళ అంతస్తుతో కూడిన ప్రధాన భవనం పైకి ఎక్కేశాడు. చేతిలో పెట్రోల్ క్యాన్, అగ్గి పెట్టెను పట్టుకుని ఆత్మాహుతి చేసుకోబోతున్నట్టు ప్రకటించా డు. దీంతో ఆ పరిసరాల్లో కలకలం బ యలు దేరింది. ఆ వర్సిటీలోని విద్యార్థు లు, అధికారులు అక్కడికి ఉరకలు తీసి, అతడ్ని వారించే యత్నం చేశారు. విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తి వేయాల్సిందేనని లేని పక్షంలో తాను ఆత్మాహుతికి సిద్ధం అని పదే పదే రాజ్‌కుమార్ హెచ్చరించడం మొదలెట్టాడు. దీంతో పోలీ సుల్ని రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది ఆ భవనం మీదకు చేరుకుని అతడ్ని వారించే యత్నం చేశారు. తనను అగ్నిమాపక సిబ్బంది సమీపించడంతో ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే యత్నం చేశాడు. దీంతో ఆ సిబ్బంది వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఆ భవనం మీద నుంచి కిందకు దిగేయక తప్పలేదు. అదే సమయంలో అక్కడి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు , సహచర విద్యార్థులు రాజ్‌కుమార్‌ను వారించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. అతడి డిమాండ్ మీద వర్సిటీ వర్గాలతో చర్చించే పనిలో పడ్డారు. అంత వరకు సంయమనం పాటించాలని రాజ్‌కుమార్‌కు సూచించారు. ఈ చర్చలు సాగుతున్న సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాక చక్యంగా వ్యవహరించి మరో మార్గంగుండా ఆ భవనంపైకి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గంట సేపుగా తీవ్ర ఉత్కంఠ, కలకలాన్ని సృష్టించిన రాజ్‌కుమార్ మీదున్న కోపంతో పోలీసులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అతడ్ని తమ వ్యాన్‌లో పడేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లే యత్నం చేయడం వివాదానికి దారి తీసింది. ఆ వ్యాన్‌కు అడ్డంగా అక్కడి విద్యార్థులు కూర్చోవడంతో, పోలీసులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. చివరకు రాజ్‌కుమార్‌ను లోనికి తీసుకెళ్లి వర్సిటీ వర్గాల ద్వారా పోలీసులు సంప్రదింపులు, చర్చలు సాగించారు. గంటకు పైగా సాగిన ఈ హైడ్రామాకు పోలీసుల ఒత్తిడితో తెర పడింది. చర్చల అనంతరం విద్యార్థుల సస్పెండ్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ వర్సిటీ యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఆత్మాహుతి యత్నం హైడ్రామా సుఖాంతమైంది. -
పండితుల ఏకఛత్రాధిపత్యంపై ‘గిడుగు’ పిడుగులు
చెన్నై, సాక్షి ప్రతినిధి : గ్రాంథికమైన తెలుగుతో భాషాధిపత్యం సాగిస్తున్న పండితుల ఏకఛత్రాధిపత్యంపై పిడుగులు కురిపించి వ్యావహారిక భాషగా మార్చిన ధీశాలిగా గిడుగు రామమూర్తి చరిత్రలో నిలిచిపోయారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్ గోపి పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ రథసారథి గిడుగు రామమూర్తి 150 జయంతి ఉత్సవాలను మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారందరికీ చెందిన భాష కొందరికి మాత్రమే పరిమితం కావడం భాషాధిపత్యం కిందకే వస్తుందని గిడుగు భావించేవారని అన్నారు. గాంథికమైన తెలుగుభాష ఆ రోజుల్లో కొందరి ప్రయోజనాలనే తీర్చేదన్నారు. మిగిలిన వారు నష్టపోవడాన్ని ఆయన సహించలేక పోయారని వివరించారు. వ్యావహారిక భాషను అమలులోకి తీసుకువచ్చేందుకు గిడుగు పండితులకే సవాల్ విసిరారని చెప్పారు. తెలుగు భాషలోని అన్ని మాండలికాలను కలుపుకుని వ్యావహారిక భాషను ప్రజలకు అందించిన చిరస్మరణీయుడు గిడుగు రామమూర్తి అని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త, భాషా ఉద్యమకారులు డాక్టర్ సామల రమేష్‌బాబు మాట్లాడుతూ భాష నశిస్తే జాతి నశిస్తుందనే స్పృహతో అందరూ తెలుగు భాషను బతికించుకోవాలని కోరారు. గిడుగు రామమూర్తి కాలంలో బ్రిటీష్ పాలకులు ఉన్నారని, ఆయన ప్రభుత్వంతో కాకుండా నాటి పండితులతో పోరాటం సాగించారని తెలిపారు. నేడు దురదృష్టవశాత్తు ప్రభుత్వంతోనే పోరాడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత, విమర్శకులు వేదగిరి రాంబాబు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి, భాషకు మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. నిబద్దత, ఆదర్శం, ముందుచూపే గిడుగు వారిని భాషోద్యమాలకు ప్రేరేపించాయన్నారు. ఆంగ్ల భాషపై మోజులో కొట్టుకుపోవద్దని, తెలుగు జాతి పరిస్థితిపై ఆలోచించాలని తల్లిదండ్రులకు కర్తవ్యబోధ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నై ఆకాశవాణి తెలుగు విభాగం అధికారి నాగసూరి వేణుగోపాల్, మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యాపకులు విస్తాలి శంకరరావు, రాజధాని కళాశాల ప్రాచార్యులు ఎల్బీ శంకర్రావు, తెలుగు ప్రముఖులు అనిల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు మాడభూషి సంపత్‌కుమార్ సభకు అధ్యక్షత వహించారు. వక్తలను తెలుగు ప్రముఖులు ఈఎస్ రెడ్డి సత్కరించారు. అంతకుముందు బుధవారం సాయంత్రం కన్నుమూసిన ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.