పండితుల ఏకఛత్రాధిపత్యంపై ‘గిడుగు’ పిడుగులు
Published Fri, Aug 23 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : గ్రాంథికమైన తెలుగుతో భాషాధిపత్యం సాగిస్తున్న పండితుల ఏకఛత్రాధిపత్యంపై పిడుగులు కురిపించి వ్యావహారిక భాషగా మార్చిన ధీశాలిగా గిడుగు రామమూర్తి చరిత్రలో నిలిచిపోయారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్ గోపి పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ రథసారథి గిడుగు రామమూర్తి 150 జయంతి ఉత్సవాలను మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారందరికీ చెందిన భాష కొందరికి మాత్రమే పరిమితం కావడం భాషాధిపత్యం కిందకే వస్తుందని గిడుగు భావించేవారని అన్నారు.
గాంథికమైన తెలుగుభాష ఆ రోజుల్లో కొందరి ప్రయోజనాలనే తీర్చేదన్నారు. మిగిలిన వారు నష్టపోవడాన్ని ఆయన సహించలేక పోయారని వివరించారు. వ్యావహారిక భాషను అమలులోకి తీసుకువచ్చేందుకు గిడుగు పండితులకే సవాల్ విసిరారని చెప్పారు. తెలుగు భాషలోని అన్ని మాండలికాలను కలుపుకుని వ్యావహారిక భాషను ప్రజలకు అందించిన చిరస్మరణీయుడు గిడుగు రామమూర్తి అని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త, భాషా ఉద్యమకారులు డాక్టర్ సామల రమేష్‌బాబు మాట్లాడుతూ భాష నశిస్తే జాతి నశిస్తుందనే స్పృహతో అందరూ తెలుగు భాషను బతికించుకోవాలని కోరారు. గిడుగు రామమూర్తి కాలంలో బ్రిటీష్ పాలకులు ఉన్నారని, ఆయన ప్రభుత్వంతో కాకుండా నాటి పండితులతో పోరాటం సాగించారని తెలిపారు.
నేడు దురదృష్టవశాత్తు ప్రభుత్వంతోనే పోరాడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత, విమర్శకులు వేదగిరి రాంబాబు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి, భాషకు మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. నిబద్దత, ఆదర్శం, ముందుచూపే గిడుగు వారిని భాషోద్యమాలకు ప్రేరేపించాయన్నారు. ఆంగ్ల భాషపై మోజులో కొట్టుకుపోవద్దని, తెలుగు జాతి పరిస్థితిపై ఆలోచించాలని తల్లిదండ్రులకు కర్తవ్యబోధ చేశారు.
ఈ కార్యక్రమంలో చెన్నై ఆకాశవాణి తెలుగు విభాగం అధికారి నాగసూరి వేణుగోపాల్, మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యాపకులు విస్తాలి శంకరరావు, రాజధాని కళాశాల ప్రాచార్యులు ఎల్‌బీ శంకర్‌రావు, తెలుగు ప్రముఖులు అనిల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు మాడభూషి సంపత్‌కుమార్ సభకు అధ్యక్షత వహించారు. వక్తలను తెలుగు ప్రముఖులు ఈఎస్ రెడ్డి సత్కరించారు. అంతకుముందు బుధవారం సాయంత్రం కన్నుమూసిన ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
Advertisement
Advertisement