బెంగళూరులో బతకడం ఇక కష్టమే!
భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరు నగరంలో ఐదేళ్ల తర్వాత బతకడం ఇక కష్టమేనని చెబుతున్నారు. అలా చెప్పింది కూడా ఏదో ఆషామాషీ సంస్థ కాదు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ). గడిచిన 40 ఏళ్లలో బెంగళూరులో భవన నిర్మాణాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయాయని ఐఐఎస్సీ తేల్చిచెప్పింది. ఇది ఏకంగా 525 శాతం ఉందట. ఒకప్పుడు హరిత నగరంగా, ఉద్యాన నగరిగా పేరొందిన బెంగళూరులో పచ్చదనం 78 శాతం పడిపోయిందట. అలాగే మొన్నటివరకు 'లేక్ సిటీ' అని కూడా పేరున్న బెంగళూరులో జలవనరులు 79% కరిగిపోయి, వాటి స్థానంలో భవనాలు వెలిశాయి.
మన చుట్టూ ఉండే మొక్కలు, నీళ్ల వల్లే మన జీవన నాణ్యత మెరుగుపడుతుందని, అవన్నీ క్రమంగా మాయం అవుతున్నాయంటే జీవనం దుర్భరం అవుతుందని ఐఐఎస్సీ పరిశీలనలో చెప్పారు. నగరంలో ఏమాత్రం అవగాహన లేకుండా విచ్చలవిడి అభివృద్ధి సాగుతోందని, ఇది సమీప భవిష్యత్తులోనే అత్యంత విధ్వంసకరంగా తయారవుతుందని ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ ఇకొలాజికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ టి.వి. రామచంద్ర హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉంటే బెంగళూరులోనే ఉండాలని అంతా అనేవారని, కానీ ఇప్పుడు రాబోయే ఐదేళ్లలో అది ఏమాత్రం బతకలేని, మృతనగరంగా మారుతుందని హెచ్చరించారు. సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉండే బెంగళూరులో అసలు నదులు లేవు. అయితే చిన్నా పెద్దా కలిపి 600 వరకు చెరువులు ఉండటంతో నగరం చల్లగా, పచ్చగా ఉండేది.
కానీ గత రెండు దశాబ్దాలుగా వచ్చిన ఆర్థికాభివృద్ధి ఈ వనరులను ధ్వంసం చేసింది. నగరానికి కావల్సిన నీళ్లన్నీ 100 కిలోమీటర్ల దూరంలో, వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కావేరీ నది నుంచి వస్తాయి. ఆ నది ఎండిపోతే.. బెంగళూరు ఎడారిగా మారుతుంది. 1990లలో మొదలైన ఆర్థిక సంస్కరణలు నగరాన్ని పూర్తిగా మార్చేశాయి. గత పాతికేళ్లలో నగర జనాభా కూడా 150 శాతం వరకు పెరిగింది. ఒకప్పుడు 40 లక్షలు మాత్రమే ఉండే జనాభా 2016లో కోటి దాటింది. ఇక్కడ భూమి దొరకడం గగనంగా మారిందని, చక్కగా ఉండే ఆర్థికవ్యవస్థ పాడైపోయి, రాజకీయాలు కుళ్లిపోయాయని ఎప్పటి నుంచో బెంగళూరులో ఉంటున్నవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.