విమాన ప్రయాణంలో ఎందుకీ వివక్ష?
సాక్షి, బళ్లారి: విమాన ప్రయాణాలు చేసేటప్పుడు తన పేరు యూటి ఖాదర్ అని చెబితే సిబ్బంది మరింతగా తనిఖీలు చేస్తున్నారని, ఈ వివక్ష ఎప్పుడు తొలగిపోతుందోనని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి యూటి ఖాదర్ అన్నారు. ధార్వాడలో ఆదివారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విమాన ప్రయాణ సమయాల్లో తన పేరు చెప్పేందుకు భయపడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అర్థం కావడం లేదన్నారు. దీన్ని నుంచి బయటపడటం అంత సులభం కాదన్నారు.
ముస్లిం ఉద్యోగులు కూడా తాము పనిచేసే సంస్థలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అయినా ఓపికతో ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లింలు తమ పిల్లలను విద్యావంతులను చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి పేదకూ బీపీఎల్ కార్డులు అందజేసేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. 8.5 లక్షల నకిలీ రేషన్‌కార్డులను గుర్తించి తొలగించామన్నారు.