Uttam Nagar
-
మొహంపై సలసల కాగిన నూనె పోశాడు..
మీరట్: మద్యం మానివేయమని భార్య చెప్పిన మాటలు ఆ భర్తకు ఆగ్రహం తెప్పించింది. దాంతో తన ఇద్దరి స్నేహితులతో కలసి భర్త విజయ్‌పాల్ భార్య సంతోష్ మొహంపై సలసల కాగిన నూనె పోశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తమ్‌నగర్‌లోని గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ పాల్ ఇంటికి చేరుకుని... సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తమ్‌నగర్‌లో నివసిస్తున్న విజయ్‌పాల్, సంతోష్ భార్యభర్తలు. విజయ్‌పాల్ తాగుడు అలవాటు అయింది. ఆ క్రమంలో రోజు తప్ప తాగి ఇంటికి వస్తున్న భర్తపై ఆమె ఆగ్రహించింది. తాగుడు మానివేయాలని అతడిని కోరింది. ఎప్పటిలాగే గురువారం విజయ్‌పాల్ తప్పతాగి అతడి ఇద్దరు స్నేహితులు కృష్ణాపాల్, అశోక్‌తో ఇంటి వచ్చాడు. దీంతో సంతోష్‌తోపాటు అతడి స్నేహితులతో ఆమె వాగ్వివాదానికి దిగింది. దాంతో ఆగ్రహించిన విజయ్ పాల్ అతడి స్నేహితుల కలసి సంతోష్ ముఖంపై వేడివేడి నూనె పోశాడు. అయితే ఈ ఘటనలో భర్త విజయ్‌పాల్, కృష్ణాపాల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!
కోడలికి కిడ్నీ దానం చేసిన అత్త న్యూఢిల్లీ: అత్తలందరూ కఠిన హృదయులు కాదని ఆమె నిరూపించింది. ఆపదలో ఉన్న కోడలిని అమ్మకంటే మిన్నగా ఆదుకుని ప్రాణం పోసింది! తొలుత కిడ్నీ ఇస్తానన్న ఆ కోడలి అమ్మ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గగా, అత్త నేనున్నానంటూ ముందుకొచ్చి కిడ్నీ దానం చేసింది. మనసు కదిలించే ఈ ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కిడ్నీ పాడవడంతో బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. కిడ్నీ మార్చాలని వైద్యులు నిర్ణయించారు. కవిత పుట్టింటి, మెట్టినింటి వారికి అదొక సవాలైంది. చివరికి ఆమె తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. సర్జరీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు నిమిషంలో కవిత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కవిత అత్త విమల(65) ‘నేను కిడ్నీ ఇస్తాను’ అంటూ ముందుకొచ్చింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు విమలకు పరీక్షలు జరిపారు. ఆమె కిడ్నీ కవితకు సరిపోతుందని నిర్ధారించారు. గత నెల 23న విమల కిడ్నీని కవితకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయిందని, అత్తాకోడళ్లు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.