UttarPradesh CM
-
50 దాటిన పోలీసులకు రిటైర్మెంట్.. యూపీ ప్రభుత్వ నిర్ణయం
పోలీసుల రిటైర్మెంట్ విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు దాటిన పోలీసుల నిర్బంధ పదవీ విరమణ కోసం స్క్రీనింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోలీసుల జాబితాను నవంబర్ 30లోగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023, మార్చి 31 నాటికి 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా పదవీ విరమణ కోసం స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాలలో పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత, నిర్ణీత తేదీలోగా నిర్బంధ పదవీ విరమణ చేయాల్సిన పోలీసుల జాబితాను అధికారులు ప్రధాన కార్యాలయానికి పంపించనున్నారు. తమ సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు లేదా చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే అతనిని రిటైర్ చేయనున్నారు. పోలీసుల స్క్రీనింగ్‌లో వారి వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో యోగి ప్రభుత్వం పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో సమర్థవంతులైన వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం యోగి ఆదేశించారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! -
పేద ముస్లింలకు యోగి వరం
తన కాషాయ దుస్తులను బట్టి తనను కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందినవాడిగా అంచనా వేయొద్దని, తన పనులు చూసి అప్పుడు చెప్పాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తొలినాళ్లలోనే చెప్పారు. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు మైనారిటీల సంక్షేమం మీద దృష్టిపెట్టారు. పేద ముస్లిం కుటుంబాలు తమ కుమార్తెల పెళ్లిళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దాంతోపాటు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. ముస్లింలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సద్భావన మండపాలు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సామూహిక వివాహాలు జరిపించేందుకు వీలుగా ’సద్భావనా మండపాలు’ నిర్మించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తే.. ప్రతియేటా రెండుసార్లు చొప్పున ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ప్రధానంగా పేద ముస్లిం కుటుంబాల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ. 20వేల సాయం అందిస్తోంది. అయితే, ఈ పథకంలో అవినీతి ఎక్కువగా ఉందని, ముస్లిం కుటుంబాలకు ఇది అందడం లేదని ఆరోపణలున్నాయి. యోగి మదిలో ఆలోచనే పరిస్థితులను నిశితంగా గమనించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ సామూహిక వివాహాల ప్రతిపాదనను తీసుకొచ్చారని మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మొహిసిన్ రజా చెప్పారు. సద్భావన మండపాలు పేద ముస్లిం కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. -
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
-
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
తాను కాషాయ దుస్తులు వేసుకుంటాను కాబట్టి తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అయితే తాను అన్ని వర్గాలకు చెందినవారి హృదయాలను గెలుచుకుంటానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్నాళ్లుగా లౌకికవాదం పేరుతో భారతీయ సంప్రదాయాలను అవమానిస్తున్న వాళ్లు తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత భయపడుతున్నారని చెప్పారు. తాను కాషాయం వేసుకుంటానని, దేశంలో చాలామందికి అసలు కాషాయం అంటే ఇష్టం లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక 'ఆర్గనైజర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తన పనితీరుతో అన్ని వర్గాలను మెప్పిస్తానని, అందరికీ సంతోషం పంచుతానని చెప్పారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ఇంతకుముందులాగే సేవ చేయాలనే వచ్చానని యోగి చెప్పారు. దేశాన్ని కాపాడటమే తన ప్రభుత్వ ప్రధాన ధర్మమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి రహిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అందిస్తామని, సమాజం నుంచి గూండా రాజ్యాన్ని తరిమేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లోనే ప్రభావం స్పష్టం కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెస్తామని, ఏ పరిశ్రమలోనైనా ఇక నుంచి 90 శాతం మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్ వాళ్లే అయ్యేలా చూస్తామని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 14 రోజుల్లోగా చెల్లిస్తామని, రాబోయే ఆరు నెలల్లో కొత్తగా ఐదారు చక్కెర కర్మాగారాలు నెలకొల్పుతామని అన్నారు. -
రుణమాఫీపై సీఎం సంచలన నిర్ణయం?
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు కోటిన్నర మంది చిన్నకారు, సన్నకారు రైతులకు రుణమాఫీ చేసే విషయమై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కోటిన్నర మంది రైతులతో కూడిన జాబితాను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి పంపినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ సాహి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రైతు రుణమాఫీ. ప్రభుత్వం ఏర్పాటు కాగానే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలోనే పడ్డామని సాహి వివరించారు. రైతుల నుంచి దాదాపు 80 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా గోధుమ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమ పొలాల నుంచి ఏడు కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా ఈ కేంద్రాలు ఉంటాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కేవలం 40 లక్షల టన్నుల గోధుమలే పండించాలని రైతులకు చెప్పిందని, కానీ తమ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసిందని మంత్రి అన్నారు. గోధుమలకు కనీస మద్దతుధర క్వింటాలుకు రూ. 1625 చొప్పున నిర్ణయించామన్నారు. మూసేసిన, వాడకుండా వదిలేసిన కోల్డ్ స్టోరేజిలను గోధుమల నిల్వకు ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి సాహి తెలిపారు. ప్రస్తుతమున్న గోడౌన్ల సామర్థ్యం 40 లక్షల టన్నులే ఉందని, అది సరిపోదు కాబట్టి మరింత నిల్వ సామర్థ్యం కోసం ఇలా ఆలోచిస్తున్నామని అన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ హామీ ఈ రకంగా నెరవేరుతుందని చెప్పారు. -
సీఎం యోగి ఎఫెక్ట్: గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు
ఆమె గ్యాంగ్‌రేప్ బాధితురాలు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం కోర్టులో పోరాడుతోంది. ఇంతలో తాజాగా ఇద్దరు వ్యక్తులు ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించారు. దాంతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చేరింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆమెకు తక్షణ సాయంగా లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. ఆమెతో యాసిడ్ తాగించిన వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. 2008 సంవత్సరంలో రాయ్‌బరేలిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాక, యాసిడ్ పోశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. త్వరలోనే ఈ కేసు విచారణకు రానుంది. తమ కుటుంబానికి తరచు బెదిరింపులు వస్తున్నట్లు బాధితురాలి భర్త తెలిపారు. ఇంతలో గురువారం నాడు తన పిల్లలను కలిసేందుకు లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊంచహార్కు వెళ్తుండగా ఆమెపై దాడి జరిగింది. ముఖ్యమంత్రి వచ్చి తమను పరామర్శించినందుకు సంతోషంగానే ఉందని.. అయితే నిందితులను అరెస్టు చేయాలని బాధితురాలి భర్త అన్నారు. యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాలు కల్పించే కేఫ్‌లో ఆమె పనిచేస్తుంది. తాను నిరుపేదనని, అయినా తన భార్యను నమ్ముతాను కాబట్టే ఈ కేసులో పోరాడుతున్నానని ఆమె భర్త చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి బాధితురాలిని పరామర్శించడంతో పాటు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా స్పీడుగా స్పందించారు. అత్యాచారం, దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసినట్లు అదనపు డీజీ ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన జరిగిన రెండు గంటల్లోనే పోలీసుల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. -
ఢిల్లీలో యూపీ సీఎం బిజీ బిజీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ రోజు (మంగళవారం) తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలసిన యోగి.. తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రణబ్‌తో యోగి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో ఆయనను కలిసిన యూపీ సీఎం.. పార్టీ, యూపీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్టు సమాచారం. యోగి ఇదేరోజు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లతోనూ సమావేశం కానున్నారు. ఉత్తప్రదేశ్ సీఎంగా యోగి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఆయన గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీగా గతంలో అనేక సార్లు ఢిల్లీకి వచ్చిన ఆయన సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ పెద్దలను కలిశారు.