ఐఐటీ పాఠ్య ప్రణాళికలో మార్పులు!
న్యూఢిల్లీ: ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో పాఠ్య ప్రణాళికలో మార్పులు చేయాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఢిల్లీ నిర్ణయించింది. విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు అదనంగా మరిన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా అన్ని ఐఐటీలకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు థియరీపై ఫోకస్ తగ్గించి.. విద్యార్థులు ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునేలా ప్రణాళిక రూపొందించనుంది. ఇలా చేయడం వల్ల చదువు ఒత్తిడిని విద్యార్థులు ప్రభావవంతంగా ఎదుర్కోగలరని భావిస్తోంది.
సవరించిన పాఠ్య ప్రణాళికను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ‘విద్యార్థులు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఐఐటీలు నిరంతర చర్యలు చేపడుతున్నాయి. కాన్ని ఎప్పుడూ ఒకటీరెండు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయ’ ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు పేర్కొన్నారు.
‘నిరంతర చదువులతో అలసిపోయిన విద్యార్థులు ఐఐటీల్లోకి రాగానే కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటారు. కాని దురదృష్టమేమిటంటే మనం ఆ అవకాశం ఇవ్వడం లేదు’ అని వివరించారు. మొదటి ఏడాది నుంచి విద్యార్థులను సరైన దారిలో గైడ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఏడాదిలో ఆ సంస్థ విద్యార్థులు మొత్తం ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.