వైఎస్సార్ సీపీకి వడ్డెరల మద్దతు
* జగన్‌తోనే మేలు జరుగుతుందని వెల్లడి
* వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి
* తమ సమస్యలపై జగన్
* సానుకూలంగా స్పందించారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న వైఎస్సార్సీపీకే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తెలిపింది. సీమాంధ్ర అభివృద్ధి ఆ పార్టీతోనే సాధ్యమని, జగన్ సీఎం అయితేనే వడ్డెరలకు మేలు జరుగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు బాలరాజు చెప్పారు. బాలరాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం జగన్మోహన్రెడ్డిని కలిసి.. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగా ల్లో వెనుకబడిన వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మాదిరిగా వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించాలని కోరింది. అనంతరం బాలరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఈ నెల 5న సీమాంధ్రలో తాము సంఘంగా ఏర్పడ్డామన్నారు.
జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వడ్డెరల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేశారని.. జగన్ కూడా తమ సంక్షేమం కోసం పాటుపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. వడ్డెరలు ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు పరిహారం అందించాలని, తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరామ న్నారు. తమ విన్నపాలపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సంఘం ప్రతినిధులు తన్నీరు రాయలబాబు, కె.జంగయ్య, యల్లె ఈశ్వరరావు, కె.రామరాజు, పల్లపు రాంబాబు, కె.వెంకట్రావు, వి.చిన్నరాజు, టి.భాస్కర్ తదితరులు జగన్‌ను కలిశారు.