అమెరికాలో వరంగల్ విద్యార్థి హత్య
ఎంఎస్ చదివేందుకు కాలిఫోర్నియా వెళ్లిన వంశీరెడ్డి
మహిళను కాపాడేందుకు యత్నించగా దుండగుడి దాడి
హసన్‌పర్తి (వర్ధన్నపేట): అమెరికాలో మరో విద్యా కుసుమం నేలరాలింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్‌కు చెందిన మామి డాల వంశీరెడ్డి(27) దుండగుడి కాల్పులకు బలయ్యాడు. ఓ యువతిని కాపాడబోయి దుండగుడి చేతిలో తాను ప్రాణాలు కోల్పోయాడు. రెండు బుల్లెట్లు నేరుగా తలలోకి దిగడంతో అక్కడక్కడే మృతి చెందాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని మిల్పిటస్ టౌన్ ఇల్లరా అపార్ట్మెంట్ వద్ద శనివారం అర్ధరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం) ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే..
వంగపహాడ్‌కు చెందిన మామిడాల సంజీవ రెడ్డి, రమాదేవి కుమారుడు వంశీరెడ్డి 2015 డిసెంబర్లో ఎంఎస్ చదివేందుకు అమెరికా లోని కాల్నిఫోర్నియా వెళ్లాడు. అక్కడ ఓ అపార్ట్మెంట్లో ఐదుగురు స్నేహితులతో కలసి ఉంటున్నాడు. మరో రెండు నెలలైతే ఆయన కోర్సు పూర్తయ్యేది. శనివారం రాత్రి ఇల్లరా టౌన్లో ఓ యువతీ కారు పార్క్ చేస్తుండగా నల్లజాతీయుడు ఒకరు ఆమె చేతిలోని కారు తాళం లాక్కోవడానికి యత్నిం చాడు. దీంతో ఆ పక్కనే ఉన్న వంశీరెడ్డి అతడిని అడ్డుకున్నాడు. ఆ దుండగుడు తన పిస్తోల్‌తో వంశీరెడ్డిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దిగడంతో వంశీ అక్కడక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వంశీని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పుల్లో కొడుకు మృతి చెందాడని తెలియడంతో ఆయన తల్లిదండ్రులు కుప్పకూలారు.
కేటీఆర్‌కు ఎమ్మెల్యే ఫోన్
వంశీరెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్‌కు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతు న్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు కూడా రాయబార కార్యాలయ ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఘటనను కేంద్రమంత్రి సుష్మస్వరాజ్‌కు దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె కూడా అమెరికా అధికారులతో మాట్లాడారు. అధికారులు వంశీరెడ్డి కుటుంబ సభ్యుల వివరాలు, గుర్తింపు కార్డులు సేకరించారు. వారు అమెరికా వెళ్లేందుకు తాత్కాలిక పాస్‌పోర్టులు, వీసాలు సిద్ధం చేసేందుకు యత్నిస్తున్నారు.
తండ్రికి ఇష్టం లేకుండానే..
వంశీరెడ్డిని అమెరికాకు పంపించడం ఆయన తండ్రి సంజీవరెడ్డికి ఇష్టం లేదు. తన స్నేహితుడి ప్రోద్భలంతో వంశీరెడ్డి అమెరికా వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వీసా వచ్చే వరకు వంశీరెడ్డి తండ్రికి సమాచారం కూడా ఇవ్వలేదు. తర్వాత కుమారుడి అభ్యర్థన మేరకు ఆయన ఒప్పుకున్నారు. పదో తరగతి వరకు వరంగల్ ఒయాసిస్ పాఠశాలలో చదివిన వంశీరెడ్డి.. విజయవాడలోని చైతన్య కాలేజీలో ఇంటర్, హైదరాబాద్‌లోని వాత్సల్య కాలేజీలో బీటెక్ చదివాడు.
రాత్రి 10 గంటలకు మాట్లాడాడు
శనివారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో నా కొడుకుతో మాట్లాడా. భోజనం చేశాను.. మంచిగానే ఉన్నానని చెప్పాడు. రెండు నెలలైతే కోర్సు అయిపోతుంది. ఇంతలోనే ఈ వార్త తెలిసింది.
–సంజీవరెడ్డి, వంశీరెడ్డి తండ్రి