ఉపాధి, ఉద్యోగాలే అభివృద్ధి
తెలంగాణలో ఉద్యోగాల కోసం జరుగుతున్న ఉద్యమం వ్యక్తుల సమస్య కాదు. అది యువత ఉపాధి సమస్య. మొత్తం అభివృద్ధి నమూనాను మార్చడమే దీనికి పరిష్కారం. యువత ఆకాంక్షలను సానుకూలంగా పరిశీలించడం ప్రభుత్వ విధి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం లాంటి పోరాటాలు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా విజయవంతంగా జరిగి తెలంగాణ సాధనకు తోడ్పడ్డాయి. దురదృష్టవశాత్తు ఉద్యమబలంతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన ధ్యేయంగా సాగుతున్న కొలువుల కొట్లాట ఉద్యమంపై అకారణ నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాం జేఏసీ కోర్టు ద్వారానైనా అనుమతి పొంది సదస్సు పెట్టాలని ప్రయత్నిస్తే, అక్కడ కూడా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక శాంతియుత పోరాటాన్ని ప్రజల ఆకాంక్షగా పరిగణించే బదులు, అరెస్టు చేసి సభలను అడ్డుకోవడం ప్రమాద హేతువు. తెలంగాణ యువత తమ బతుకు తెరువుకు మార్గాలను చూపమని అడుగుతోంది. ప్రభుత్వం కొంత శ్రద్ధ పెడితే కొంతవరకైనా సమస్యను ఎదుర్కోవచ్చు.
ఉద్యోగాలు, ఉపాధి సమస్య ప్రభుత్వాలు అవలంబిస్తున్న అభివృద్ధి నమూనాతో ముడిపడి ఉంది. దేశంలో 1980ల నుంచి అమలు చేసిన అభివృద్ధి విధానంవల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే బదులు చాలా పెద్ద ఎత్తున తగ్గుతూ వచ్చాయి. మన రాష్ట్రంలోనే ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల్లో దాదాపు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి. శాశ్వత ఉద్యోగులను కాకుండా తాత్కాలిక ఉద్యోగులను నియమించడం వలన సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ఇది ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో పడేస్తుంది. ఏ ఆర్థిక అభివృద్ధికైనా ఉద్యోగ కల్పన ప్రధాన అవసరం. పైకి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లు కనిపించినా ఉపాధి అవకాశాలు లేకపోతే ఆ అభివృద్ధి ఎక్కువ కాలం నిలవదు.
1930లలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు జేఎం కీన్స్ ఉద్యోగ కల్పన ద్వారానే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలని, ఏ పని లేకున్నా కనీసం ‘గుంతలను తవ్వి వాటిని పూడ్చేటటువంటి’ పనినైనా కల్పించండి అని సూచించారు. పని కల్పించడమంటే దానిని పెట్టుబడిగానే పరిగణించాలి. ఎన్ని ఎక్కువ అవకాశాలు కల్పిస్తే ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి అంత పెరిగి వ్యవస్థ చలనశీలత పెరుగుతుంది. వృద్ధిరేటు పెరిగి ఉద్యోగాలు కల్పించకపోతే ఆ వ్యవస్థ దీర్ఘకాలంలో సంక్షోభంలో పడుతుంది. కాని ఇలాంటి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకులాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వ్యతిరేకం. ఈ సంస్థలు ప్రభుత్వ ఖర్చు తగ్గించుకోవాలని, ఉద్యోగులను కుదించాలని ప్రభుత్వాలమీద ఒత్తిడి పెడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా యువత నిరాశలో ఉంది. ఉద్యోగ నియామకాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్లో చాలా బలంగా ఉన్నాయన్నది తెలిసిన విషయమే. అందరికీ పని కల్పిస్తాం అనేవారున్నారు. ఆ పని ప్రభుత్వ ఉద్యోగమే కానక్కర లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ పనితీరులో అందరికీ చేతి నిండా పని కల్పించే వెసులుబాటు ఉండాలి. అభివృద్ధి నమూనా దిశే అలా ఉండాలి.
మన రాష్ట్రంలో రోజువారీ కూలీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ అసంఘటిత రంగాన్ని అన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్లకు పని దొరకకపోతే ఆరోజు పస్తు ఉండటమే. ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనాలో వ్యవసాయానికి ప్రాధాన్యతే లేదు. అలాగే పంట భూములు ఆహారేతర వాణిజ్య పంటలకు మార్చడంతో రైతులు విపరీతమైన అప్పుల్లో పడుతున్నారు.
ఉపాధి ఆదాయాలు సరిగా లేకపోవడం వలన మనం మానవాభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాం. గత నాలుగేళ్లలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వే చేసిన 119 దేశాలలో భారత్ 100వ స్థానంలో ఉంది. పౌష్టికాహార లోపంతో 168 దేశాలలో మనం 131 స్థానంలో ఉన్నాం. ఐదేళ్లకంటే తక్కువ వయసున్న శిశుమరణాలలో 175 దేశాలలో మనది 126వ స్థానం. ఈ పరిణామాలన్నీ దేశ తిరోగమన విధానాల ఫలితం. సాధారణంగా వ్యవసాయ దేశాలు, పారిశ్రామికంగా ఎదిగిన తర్వాత సేవారంగ విస్తరణ జరుగుతుంది. మనం ఆ సహజ అభివృద్ధి మార్గంలో కాకుండా ప్రపంచ ఆర్థిక సంస్థల ఒత్తిడి వలన లోపభూయిష్టమైన అభివృద్ధి నమూనాను అనుసరించాం. దీంతో నియామకాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.
కొలువుల కొట్లాటను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఇది చాలా సీరియస్ సమస్య. జేఏసీ నిర్వహించాలనుకున్న సదస్సు కేవలం విద్యార్హతలున్న యువత సమస్య మాత్రమే. మొత్తం సమస్యకు పరిష్కారం అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించడమే. కనీసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య చదివిన మొద టితరం యువత ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం తీవ్రమైన సమస్యగా పరిగణించి, సదస్సుకు అవకాశమివ్వడమే కాక యువత ఆకాంక్షలపట్ల సానుకూలంగా స్పందించాలి. నిరుద్యోగాన్ని తొలగించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక వేయాలి. ఉద్యమం నుంచి ఎదిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యలపై తగిన రీతిన స్పందించాలి.
- డాక్టర్ యం. వనమాల
వ్యాసకర్త రిటైర్డ్ రీడర్, ఉస్మానియా యూనివర్సిటీ
మొబైల్ : 96408 93036