
‘జీవన భృతి’పై ఆందోళన
ఆర్మూర్ తహశీల్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా
ఎన్నికల ముందు హామీని సీఎం కేసీఆర్ నెలబెట్టుకోవాలి
ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శివనమాల కృష్ణ డిమాండ్
ఆర్మూర్ టౌన్: బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి వెంటనే అమలు చేసి సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు. జంబీ హనుమాన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించగా వేలాది మంది బీడీ కార్మికులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార సభల్లో తనకు తానుగా బీడీ కార్మికుల బతుకు దుర్భరంగా ఉందని తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం లో ఏడు లక్షల మంది బీడీ కార్మికులుంటే 25 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరి ఓట్లను పొందేందుకు కేసీఆర్ హామీ ఇవ్వగా, కా ర్మికుల కుటుంబాలు నమ్మి ఓట్లు వేశాయని అన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సైతం బీడీ కార్మికుల జీవన భృతి చర్చకు వచ్చిందని అన్నారు. కానీ బడ్జెట్‌లో మాత్రం బీడీ కార్మికుల జీవన భృతి అంశానికి నిధులు కేటాయించలేదని, దీంతో కార్మికుల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనైనా బీడీ కార్మికులకు జీవన భృతి అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ రికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశా ల్లో ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అన్ని పక్షాల నాయకులను కలిసి కోరామని చెప్పారు. కా గా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేసిందని విమర్శించారు. ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసిందని అన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు, రింగ్ రోడ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మెట్రో లైన్ పొడగింపునకు రూ. వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్ బీడీ కార్మికులకు రూ. 840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. వెంట నే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు, పెన్షన్‌దారులకు జీవన భృతి ఎప్పటి నుంచి ఇచ్చేది స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అ నంతరం ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు బి దేవరాం, ఐఎఫ్‌టీయూ డివిజన్ నాయకుడు సూర్య శివాజీ ప్రసంగించారు. అనంతరం అరుణోదయ కళా బృందం ప్రదర్శనతో అంబేద్కర్ చౌరస్తా వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం తహశీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ మేరకు తహశీల్దార్ డి శ్రీధర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఎన్ దా సు, సత్తెక్క, సార సురేష్ తదితరులు పాల్గొన్నారు.