ఉత్కంఠ రేపుతోన్న ఆగస్టు 14..
రియో డి జెనిరో: భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ఒక్కరోజు ముందు జరగబోయే పోటీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత జిమ్నాస్టిక్స్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ.. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన జిమ్నస్ట్ దీపా కర్మాకర్.. ఆదివారం రాత్రి జరిగిన వాల్ట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి, ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలు ఆమెనే కావడం విశేషం. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఆశలను సజీవంగా నిలిపిన ఆమె.. ఆగస్టు 14న జరగబోయే ఫైనల్స్ లో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు జిమ్నాస్ట్ లతో తలపడనుంది. తుదిపోరులోనూ ఆమె మెరిసి పతకం సాధించాలని దేశం యావత్తు కోరుకుంటోంది. (భారత ఆశా'దీపం')
ఒక్క హాకీ తప్ప అన్ని క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు ఫైఫల్యాల బాట పడుతున్నవేళ.. ఆదివారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్‌లో దీపా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. మొదటి ప్రయత్నంలో భాగంగా డిఫికల్టీలో 7.0, ఎగ్జిక్యూషన్ లో 8.1 పాయింట్లు సాధించిన దీపా.. రెండో రౌండ్ డిఫికల్టీలో మాత్రం 6.0 పాయింట్లు మాత్రమే సాధించింది. మొదటి రౌండ్లో వాల్ట్పై ధీమాగా నిలబడగలిగిన ఆమె, రెండో రౌండ్ 'ట్రస్క్ డబుల్ ఫుల్ ట్విస్ట్'ను ప్రదర్శించడంలో కాస్త తడబాటుకులోనైంది. మొత్తానికి 14.850 పాయింట్లు సాధించిన మొదటి ఎనిమిది మందిలో ఒకరిగా ఫైనల్స్ లోకి ప్రవేశించింది. కెనడియన్ జిమ్నాస్ట్ షాలోన్ 14.950 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. (కొండగాలి తిరిగింది)
ఇక మిగతా పొజిషన్లను గమనిస్తే మూడు సార్లు ప్రపంచ చాంపియన్, అమెరికన్ జిమ్నాస్ట్ అయిన సిమోనె బైల్స్ 16.050 పాయింట్లతో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. ఆమె రెండు రౌండ్లలోనూ ఎగ్జిక్యూషన్ లో 9.700 పాయింట్లు సాధించింది. నార్త్ కొరియాకు చెందిన జాంగ్ ఉన్ హాంగ్ 15.683 పాయింట్లతో రెండో స్థానాన్ని, స్విట్జర్లాండ్ జిమ్నాస్ట్ గులియా స్టెయిన్ బర్గ్ మూడో(15.266 పాయింట్లు) స్థానంలో నిలిచారు. వీరంతా ఆగస్టు 14న జరిగే మహిళల వ్యక్తిగత విభాగ పతకాల కోసం పోటీపడతారు. ఇక మిగతా క్రీడాంశాల్లో భారత టీటీ, షూటర్లు, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, వెయిట్ లిఫ్టర్లు, ఆర్చరీ జట్లు ఓటమిచెందాయి. కాగా, రేపు (ఆగస్టు 9న) దీపాకర్మాకర్ పుట్టినరోజని, పతకం సాధింస్తే అంతకంటే గొప్ప గిఫ్ట్ ఉండబోదని ఆమె తండ్రి దులాల్ కర్మాకర్ అంటున్నారు. (రెండో రోజూ భారత్ కు వైఫల్యాలే)