Veerabhogha Vasantharayalu
-
విడుదల రోజు మళ్లీ చూస్తా – సుకుమార్
‘‘ఒక కొత్త ఆలోచనతో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఈ చిత్రం కథే’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ ముఖ్య తారలుగా ఆర్. ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. బెల్లన అప్పారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడానికి ఓ సారి ఇంద్ర వచ్చినప్పుడు కుదరదని చెప్పాను. ఆ తర్వాత ఓ సందర్భంలో ఈ సినిమా ఆలోచన గురించి చెప్పాడు. ఇటీవల ఈ సినిమా చుశా. చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ట్రెండీగానూ ఉంది. ఐడియా పరంగా ఇంద్రకు నేను పోటీ కాదని ఈ సినిమా చూశాక అర్థం చేసుకున్నాను. సినిమా విడుదల రోజు మళ్లీ చూస్తా’’ అన్నారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. నేను మాట్లాడటం కంటే విడుదలయ్యాక ఈ సినిమానే ఎక్కువగా మాట్లాడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఇంద్ర చాలా కష్టపడ్డారు. చిరంజీవి ఇంద్ర కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ఈ కార్యక్రమంలో శ్రియ పాల్గొన్నారు. -
ఓ సలహా.. ప్లీజ్..
... అంటున్నారు శ్రియ. ఇంతకీ ఏ విషయంలో సలహా కావాలి? అంటే.. బుక్స్ గురించి. ఈ బ్యూటీ బాగా పుస్తకాలు చదువుతారు. ‘‘ఏదైనా మంచి పుస్తకం ఉంటే సూచించండి. ప్రభావితం చేసే జీవిత కథలు, మంచి ప్రేమకథలు, చరిత్రకు సంబంధించిన బుక్స్ గురించి చెప్పండి’’ అంటున్నారు. ఒక్క కండిషన్ పెట్టారు. మర్డర్ మిస్టరీ, హారర్ పుస్తకాల గురించి మాత్రం చెప్పొద్దంటున్నారామె. ఏం? అలాంటి బుక్స్ చదవాలంటే భయమా? అనడిగితే – ‘‘భయం కాదు. అవి చదవడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం? మంచి పుస్తకాలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మన జ్ఞానం పెరుగుతుంది’’ అన్నారు. ఇంత తీరికగా బుక్స్ గురించి అడుగుతున్నారంటే శ్రియ చేతిలో సినిమాలు లేవనుకుంటున్నారేమో? తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘నరగసూరన్’, తెలుగు చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’లో నటిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఏదొక బుక్ చదువుతుంటారు. -
జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్!
శ్రియను చూస్తే కొంతమంది అమ్మాయిలకు అసూయగా, అబ్బాయిలకు హ్యాపీగా ఉందట. ఎందుకంటే... ఇప్పుడామె వయసెంత? అల్మోస్ట్ 35 ఇయర్స్. శ్రియను చూస్తే అలా కనిపిస్తారా? పాతికేళ్ల అమ్మాయిలా ఉంటారు కదూ! అందుకే, అమ్మాయిలు అసూయ పడుతున్నారట! ఇప్పుడామె నటిస్తున్న సినిమా విడుదలైనప్పుడు ఆ అమ్మాయిలంతా మరింత అసూయ పడతారేమో? ఎందుకంటే... అందులో అల్ట్రా మోడ్రన్ ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తున్నారీమె. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘వీరభోగ వసంతరాయులు’. ఇందులోనే శ్రియ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనున్నారు. రీసెంట్గా రిలీజైన ‘పైసా వసూల్’లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా మెప్పించారు శ్రియ. ఇప్పుడా పాత్ర నుంచి బయటకొచ్చేశారు. జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్‌గా మారారు. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయులు’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్ హోస్టెస్‌గా శ్రియ, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంద్రసేన దర్శకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోలు, విలన్లు ప్రత్యేకంగా ఎవరూ లేరు. కథలో ప్రతి ఒక్కరి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుందట!