నా కుమారుడిది హత్యే
♦ రోహిత్ తండ్రి వేముల మణికుమార్
♦ సుప్రీంకోర్టు సిటింగ్‌జడ్జితో విచారణ జరిపించాలి
♦ మాది ముమ్మాటికీ వడ్డెర కులమే
విజయవాడ(గాంధీనగర్): ‘‘సెంట్రల్ యూనివర్సిటీ నా పెద్దకుమారుడిని బలితీసుకుంది. నా పిల్లవాడు చచ్చిపోయేంత పిరికివాడు కాదు. ఇది కచ్చితంగా హత్యే, ఆత్మహత్య కాదు’’ అని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ తండ్రి వేముల మణికుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రోహిత్ న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరూ చనిపోయిన తన కుమారుడి గురించి ఆలోచించట్లేదని, కేవలం కుల, శవ రాజకీయాలు చేస్తున్నారని మణికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు.
నేను, నా భార్య వడ్డెర కులస్తులమే..
తమ ఇంట్లోనే తాను వడ్డెర అని చెబుతుంటే.. తన భార్యాపిల్లలు మాల కులమని చెబుతున్నారని, మాల ఎలా అయ్యారంటే రకరకాల కారణాలు చెబుతున్నారని ఆయన వాపోయారు.
తాను వడ్డెర కులస్తురాలినే పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. తన భార్య రాధిక తన మనసులో మాట చెబుతోందో? బయటినుంచి వచ్చిన ఆదేశాల మేరకు చెబుతుందో? అర్థం కావట్లేదని ఆయనన్నారు. ముమ్మాటికీ తాము వడ్డెర కులస్తులమేనని ఆయన స్పష్టం చేశారు.
దెయ్యాల నిలయాలుగా మారాయి
రోహిత్ దళితులు, బీసీలు, ఓసీలకోసం చావలేదని, యూనివర్సిటీ వేధింపులే కారణమని మణికుమార్ అన్నారు. సస్పెండైన ఐదుగురు దీక్ష చేస్తుంటే తన కుమారుడు ఒక్కడే ఎందుకు చనిపోయాడు? మిగిలినవారు ఎందుకు తప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. రోహిత్‌ను చంపి ఉరివేశారన్న ఆనుమానాన్ని వ్యక్తం చేశారు.
విద్యే ప్రధానంగా, దేవాలయాల మాదిరి ఉండాల్సిన యూనివర్సిటీలు దెయ్యాలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ సంగం మాట్లాడుతూ.. రోహిత్ మృతి అనుమానాలకు తావిస్తోందన్నారు. అంబేడ్కర్ విద్యార్థి సంఘం, ఏబీవీపీ, రోహిత్‌తో కలసి ఉంటున్న నలుగురు స్నేహితులతోపాటు దత్తాత్రేయ, స్మృతిఇరానీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.