మానవతకు మారుపేరు జస్టిస్ చౌదరి
నివాళి: చౌదరికి న్యాయమూర్తిగా, మానవతావాదిగా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. జీవితాంతం ఆ విలువలకూ, అభిప్రాయాలకూ కట్టుబడి ఉన్నారు. ఆయన ఉరిశిక్షను వ్యతిరేకించారు. ఎవరికీ ఉరిశిక్ష విధించలేదు. ఆయన అత్యంత మౌలిక ఆలోచనాపరుడు.
ఇటీవలే మరణించిన రాష్ట్ర హైకోర్టు న్యా యమూర్తి (రిటైర్డు) పీఏ చౌదరి అత్యంత మౌలిక ఆలోచనాపరుడు. ఆచరణవాది. అన్నింటికన్నా మించి మంచి విశ్లేషకుడు. స్త్రీల సమస్యల పట్ల సానుభూతిపరుడు. మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని నమ్మేవారిలో ప్రథముడు. 2007లో ఆయన అప్పటిదాకా వెలువరించిన తీర్పులను ‘జస్టిస్ చౌదరీస్ విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్’ సంకలనం చేసి పుస్తకావిష్కరణ సభలో హై దరాబాద్లో జరగగా, అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎస్బీ సిన్హా మాట్లాడుతూ, ‘జస్టిస్ చౌదరి తీర్పు లు ఆదర్శనీయమని, ఇలాంటి ప్రతిభామూర్తి సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులు కాకపోవడం దురదృష్టకరమని’ వ్యాఖ్యానించారు. న్యాయకోవిదుడు ప్రొఫెసర్ ఎర్రబి, మా డభూషి శ్రీధర్ సంయుక్తంగా ఈ గ్రంథాన్ని వెలువరించారు. పుస్తకానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య ముందుమాట రాస్తూ, పీఏ చౌదరి సుప్రీంకోర్టుకు వెళ్లకపోవడం ‘విధి నిర్లక్ష్యం’గా పేర్కొన్నారు. చౌదరి మాట్లాడుతూ, అక్కడ ‘విధి నిర్లక్ష్యం’ బదులు శివశంకర్ అని రాసి ఉంటే సరిపోయేదన్నారు. ఆ సభలోనే ఉన్న శివశంకర్ ఆ మాట వినగానే బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో శివశంకర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు.
ప్రముఖ సినీ తార సరిత కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చౌదరి తీర్పు సంచలనాత్మకమే కాదు, సాహసోపేతం కూడా. సరితకు చిన్న వయసులోనే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తితో పెళ్లయ్యింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ మద్రాసులో కొంతకాలం కాపురం చేశారు. సినీ తారగా ఎదిగిన సరిత భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆ సమయంలో వెంకటసుబ్బ య్య తన భార్యను తనతో కాపురం చేసేటట్లు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోర్టుకెళ్లారు. ఈ కేసు కింది కోర్టు నుంచి హైకోర్టుకొచ్చింది. దీనిపై జస్టిస్ చౌదరి తీర్పు వెలువరిస్తూ, రాజ్యాంగం ప్రసాదించిన, వ్యక్తి స్వేచ్ఛ, గౌరవాలకు విరుద్ధంగా ఉన్న హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 చెల్లదని కొట్టివేశారు. ‘‘భార్య, భర్త సంపాదించిన సొంత ఆస్తి కాదు. ఆమె అంగీకారం లేకుండా ఆమె శరీరంలోని ఏ భాగం తాకి నా నేరమే అవుతుంది. ఇష్టం లేకుండా బలవంతంగా కాపురం చేస్తే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది.’’ అంటూ తీవ్ర స్వరంతో చెప్పారు.
జస్టిస్ చౌదరి సామ్యవాది. సమాజంలో అన్యాయం ఎక్కడున్నా తనతీర్పుల ద్వారా సరిదిద్దడానికి ప్రయత్నం చేశారు. విశాఖపట్నంలో ఓ కార్మికుడు భార్యను వదిలేసి వెళ్ళిపోగా, భర్తకు కేటాయించిన క్వార్టర్లో భార్య ఉండసాగింది. కార్మికుడు భార్యను వదిలాడుకాని, ఉద్యోగంలోనే ఉన్నాడు. ఈ సమయంలో క్వార్టర్ ఖాళీ చేయాల్సిందిగా యాజమాన్యం కోర్టుకెళ్లింది. జస్టిస్ చౌదరి తీర్పులో ‘రాజ్యా ంగరీత్యా మనది సోషలిజం ఆదర్శంగా ఉన్న దేశం కనుక సోషలిజంలో వ్యక్తికీ, వ్యక్తికీ మధ్యన సంబంధాలు పెంపొందాలే తప్ప, యజమానికీ-ఆస్తికీ మధ్యకాదు. ఒక ఆడపడుచు, ఆమె సంతానం బజారుపాలుకావటానికి వీల్లేదని’ మానవత్వంతో తీర్పు చెప్పారు.
1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని ‘ఆస్థాన’ పదవుల్నీ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొని ఆ పదవుల్లో ఉన్న వారందర్నీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిందిగా లేఖ రాసింది. అప్పుడు ఆస్థాన కవిగా ఉన్న దాశరథి ససేమిరా తొలగనని మొండికేశారు. తనకు ఆ పదవిలో జీవితాంతం కొనసాగే హక్కు ఉందని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును చౌదరి చాలా లోతుగా పరిశీలించి, ఇంగ్లిషువారు అనుసరిస్తున్న చట్టాలను క్షుణ్ణం గా పరిశీలించి ప్రభుత్వం ‘ఆస్థాన పదవులను’ రద్దు చేయడంలో ఎలాంటి తప్పిదం చేయలేదని తీర్పు చెప్పారు.
చౌదరికి న్యాయమూర్తిగా, మానవతావాదిగా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. జీవితాంతం ఆ విలువలకూ, అభిప్రాయాలకూ కట్టుబడి ఉన్నారు. ఆయన ఉరిశిక్షను వ్యతిరేకించారు. జస్టిస్ చౌదరి ఎవరికీ ఉరిశిక్ష విధించలేదు. కింది కోర్టులు విధించిన మరణశిక్షను ఖరారు చేయలేదు. పౌరహక్కుల సంఘాల పాత్ర పట్ల ఎంతో గౌరవం ఉండేది. ‘జుడిషియల్ యాక్టివిజమ్’ ఆద్యులుగా చెప్పకునే మాజీ న్యాయమూర్తులు భగవతి, కృష్ణయ్యర్, చెన్నపరెడ్డి సరసన జస్టిస్ పీఏ చౌదరిని చేర్చడం సబబనిపిస్తుంది.
(వ్యాసకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
వెనిగళ్ళ వెంకటరత్నం