కేంద్రమంత్రి వెంకయ్య దిష్టిబొమ్మ దహనం
వర్గీకరణ ప్రకటనపై మాలల ఆందోళన
ఉప్పలగుప్తం :
ఎస్సీ వర్గీకరణ చేస్తామని చేసిన ప్రకటనతో కేంద్రమంత్రులు ఎం.వెంకన్నాయుడు, బండారు దత్తాత్రేయ మాలలను మోసం చేశారని, తమపై చౌకబారు వ్యాఖ్యలు చేసి అవమానపరిచారని ఆరోపిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ఆందోళన దిగారు. వెంకయ్య దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. గొల్లవిల్లి సెంటరులో మంగళవారం నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది మంది మాలలు సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసినా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కేంద్రమంత్రులు మాదిగలను రెచ్చగొడుతున్నారని నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సురేష్‌బాబు, జంగా బాబూరావు, నందిక శ్రీనివాసరావు ఆరోపించారు. మాదిగలకు అండగా ఉంటామని చెప్పిన వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, వీరిని మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే మాలల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. మాలమహానాడు మండల అధ్యక్షుడు కొంకి వెంకట బాబ్జీ, పెయ్యల విష్ణుమూర్తి, పరశురాముడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పినిపే జయరాజ్, పరమట సత్యనారాయణ, బడుగు అబ్బులు, యాళ్ళ లక్ష్మినారాయణ, గుత్తాల బోసు, ఉండ్రు బాబ్జీ, మెండు రమేష్ తదితరులు ఈమేరకు తహసీల్దార్ ఎస్.సుబ్బారావు, ఎంపీడీఓ వి.శ్రీనివాస్‌లకు వినతిపత్రాలు అందజేశారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా..
కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దండోరా సభలో ప్రకటించడాన్ని నిరసిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు మాలలు నిరసించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చురేపి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీసీడీ వర్గీకరణను అడ్డుకుని తీరుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బి.అచ్చారావు, పెయ్యల అరుణ్‌కుమార్, గంటా వీరబాబు, ఎ¯ŒS.వీరబాబు, బూషణం, అమర్నాధ్, నాని, కిషోర్ తదితరలు పాల్గొన్నారు.