బాహాబాహీ
- రచ్చకెక్కిన బద్వేలు ‘దేశం’ ఇన్ ఛార్జి రగడ
- జిల్లా అధ్యక్షుని సయోధ్య యత్నం విఫలం
- వాగ్వాదాలు, తోపులాటలతో ఉద్రిక్తంగా మారిన టీడీపీ కార్యాలయం
- ఇన్ఛార్జిని ప్రకటించని లింగారెడ్డి
బద్వేలు అర్బన్: బద్వేలు తెలుగుదేశం పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గ ఇన్చార్జి కోసం విజయమ్మ, విజయజ్యోతిల మధ్య జరుగుతున్న రగడ తారస్థాయికి చేరింది. ఇరువురిని సమన్వయ పరిచేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసిన సయోధ్య యత్నం విఫలమైంది. ఇరువర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి సిద్ధమయ్యారు. తీవ్ర తోపులాటలు, దూషణల నడుమ టీడీపీ కార్యాలయం ఉద్రిక్తంగా మారింది. బుధవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి సమక్షంలో జరిగిన ఈ రచ్చకు బద్వేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక అయింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బ్యాంక్ మేనేజర్ విజయజ్యోతి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చూస్తుండేవారు. విజయజ్యోతికి ఎన్నికల్లో విజయమ్మ సహకరించలేదని విజయజ్యోతి వర్గీయులు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. విజయమ్మ కూడా పార్టీకోసం కష్టపడి పనిచేశాను. తానే ఇన్చార్జిగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలకు విజయమ్మ, విజయజ్యోతి వేర్వేరుగా పాల్గొంటూ వచ్చారు. అయితే ఇటీవల విజయజ్యోతికి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినట్లు, అందుకు ఆమె వర్గీయులు సంబరాలు జరుపుకున్నట్లు ఓ దినపత్రిక(సాక్షికాదు)లో ప్రచురితమైంది.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి బుధవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరువురు నేతలను సమావేశ పరిచారు. విజయమ్మ, విజయజ్యోతి వర్గీయులు కార్యాలయం ఎదుట భారీగా మోహరించారు. సుమారు నాలుగు గంటలపాటు ఇరువురితో చర్చలు జరిపిన లింగారెడ్డి ఇరువురు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించినట్లు సమాచారం.
ఈ సమయంలో విజయజ్యోతి బయటకు వచ్చి తన వర్గీయులతో జరిగిన విషయం చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ర్టమంతటా ఎన్నికల్లో ఓడిపోయిన వారినే ఇన్చార్జిలుగా నియమిస్తుంటే ఒక బద్వేలులో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారంటూ లింగారెడ్డిపై మండిపడ్డారు. ఈ దశలో విజయమ్మ వర్గీయులు సైతం ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న విజయమ్మను కాదని నిన్న, మొన్న వచ్చిన విజయజ్యోతికి ఇన్చార్జి బాధ్యతలు ఎలా ఇస్తారని లింగారెడ్డిని ప్రశ్నించారు. ఈ సమయంలో విజయమ్మ, విజయజ్యోతి వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి.
ఒకానొక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. సర్దిచెప్పేందుకు వెళ్లిన లింగారెడ్డిని ఇన్నేళ్లు పార్టీ గురించి విజయమ్మ ఏమాత్రం పట్టించుకోనప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు, మీకు మాట్లాడే అర్హత లేదు అంటూ కలసపాడు మండలానికి చెందిన దివంగత సీనియర్ నాయకుడి కుమారుడు వాగ్వాదానికి దిగారు. విజయజ్యోతిని సమావేశంలోకి రావాల్సిందిగా లింగారెడ్డి కోరినప్పటికీ ఆమెను లోపలికి పోనివ్వకుండా ఆమె వర్గీయులు అడ్డుకున్నారు. ఒక దశలో విజయమ్మ జిందాబాద్, విజయజ్యోతి జిందాబాద్ అంటూ ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం విజయజ్యోతితో మరోసారి మాట్లాడిన లింగారెడ్డి ఆమెను విలేకర్ల సమావేశంలోకి తీసుకువచ్చారు. ఇంత రచ్చ జరిగినా ఇన్చార్జి విషయం ఎటూ తేల్చకపోవడంతో కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. అయితే విజయమ్మ బంధుగణమైన సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి ఇది టీడీపీ కార్యాలయం కాదు, విజయమ్మ ఇళ్లు. మర్యాదగా బయటకు వెళ్లండంటూ తన వర్గీయులను అనడం ఎంతవరకు సమంజసమని విజయజ్యోతి లింగారెడి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇరువురు సమన్వయంతో పనిచేయాలి
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ విజయమ్మ, విజయజ్యోతిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరువురు కూడా పార్టీకోసం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ మేరకు ఇరువురితో మాట్లాడినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్చార్జిలను ప్రకటించలేదని, రాష్ట్రవ్యాప్తంగా తమ అధినేత ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో, అలాగే బద్వేలులో కూడా అమలు పరుస్తామని తెలిపారు. అలాగే అధిష్టానం నిర్ణయించిన నిర్ణయానికి ఇరువురు కూడా కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపాలిటీతో పాటు బద్వేలు రూరల్, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, కలసపాడు, కాశినాయన,పోరుమామిళ్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.