‘ఫిరాయింపులతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం’
సాధారణ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పార్టీల ఫిరాయింపులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. బలమైన పౌర సమాజం ద్వారా ప్రజలను జాగృతులను చేస్తేనే ఫిరాయింపులను నిరోధించవచ్చని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని తక్షణమే అనర్హులను చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని సూచించారు.