Vital rao
-
‘సాక్షి’ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుల హత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల సాక్షి రిపోర్టర్ కమలాపురం పోశెట్టిపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేశారు. శనివారం మండలంలోని కొత్తపల్లిలో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతుబంధు సంబురాల కార్యక్రమం కవరేజ్ నిమిత్తం ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వల్లభాపూర్ గ్రామ సమీపంలో రెండు బైక్‌లపై, మంకీ క్యాప్‌లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. సమీపంలోని పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలు పరుగున రావడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పోశెట్టిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మాక్లూర్ సొసైటీలో చోటుచేసుకున్న రూ.30 లక్షల అక్రమాలపై పోశెట్టి ఇటీవల వార్తలు రాశారు. అలాగే, గత శుక్రవారం మెట్పల్లిలో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో విఠల్‌రావు మాట్లాడుతూ.. సోయిలేని ప్రజాప్రతినిధి అంటూ ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త రాయడంతోపాటు గతంలో సొసైటీలో అక్రమాల గురించి రాసినందుకు మాక్లూర్ సొసైటీ చైర్మన్ కొడుకు గోపు రంజిత్, నందిపేట మండలం లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ సూత్రధారులుగా ఈ హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోశెట్టి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఖబడ్దార్ జీవన్‌రెడ్డి: విరాహత్ రిపోర్టర్‌పై హత్యాయత్నాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాల చిట్టాను వెలికితీస్తామంటూ ఖబడ్దార్ అని హెచ్చరించారు. క్షమించరాని నేరం: ప్రవీణ్‌కుమార్ (బీఎస్పీ) పోశెట్టిపై హత్యాయత్నాన్ని బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖండించారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చిన గిరిజన విలేకరిపై దాడి చేయడం క్షమించరాని నేరమన్నారు. -
ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి
‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. నీ రూపం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది.. నీ నటనతోనే ఈ సినిమాకు ప్రాణం వస్తుంది’ అంటూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగిని ఒప్పించి ఆ చిత్రంలో నటించేలా చేశారు. అదే ‘మేజర్ చంద్రకాంత్’ చలనచిత్రం. ఇప్పటికీ ఆయన నటించింది ఆ ఒక్క సినిమాలోనే. ఆ పాత్రలో జీవించి.. జీవితాంతం ఎన్టీఆర్‌తో నటించానన్న సంతృప్తి, సంతోషంతో కాలం గడుపుతున్నారు చింతలపాటి హరివిఠల్‌రావు. ఆ సినిమాలో అవకాశం గురించి తన అనుభవాలు ఇలా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – బంజారాహిల్స్ మాది విజయవాడ. అప్పట్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో డీజీఎంగా పనిచేసేవాడిని. నగరంలోని అబిడ్స్‌లో పని చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ తరచూ మా బ్యాంక్‌కు వచ్చేవారు. కొన్ని బ్యాంక్ పనుల నిమిత్తం ఆయన ఇంటికి వచ్చివెళుతుండేవారు. నన్ను కలిసిన ప్రతి సందర్బంలోనూ ‘నువ్వు సీఎంలా ఉంటావు’ అంటూ నవ్వేవారు. ఎప్పటికైనా నేను నటించే సినిమాలో సీఎం పాత్ర ఉంటే తప్పకుండా నువ్వే నటించాలంటూ చెబుతుండేవారు. ఇదంతా అయ్యేది కాదు.. పొయ్యేది కాదూ అంటుండేవాణ్ని. లోలోపల నవ్వుకునేవాణ్ని. ఈ నేపథ్యంలోనే 1992– 93లో మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయానికి ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సినిమాలో సీఎం పాత్ర ఉందనగానే ఎన్టీఆర్‌కు నేను గుర్తుకొచ్చాను. ఇంకేముంది సూరత్‌లో పనిచేస్తున్న నన్ను చాలా కష్టపడి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించి నన్ను అక్కడినుంచి రప్పించారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో నేను సీఎంపాత్రలో నటించేందుకు ఇక్కడికి వచ్చాను. పది రోజుల్లోనే షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. భయం.. భయంగా.. సినిమా నటించేందుకు భయంగా ఉందని, నటన రాదని ఎంత చెప్పినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. నేను నేర్పిస్తాను నువ్వేం అధైర్యపడవద్దంటూ దగ్గరుండి మరీ భరోసా కల్పించారు. ఆ సినిమాలో నాలుగు సీన్లు ఉన్నాయి. అవన్నీ ఎన్టీఆర్తోనే కావడం నా అదృష్టం. నటించింది ఒక్క సినిమాలో అయినా ఎన్టీఆర్ పక్కన కనిపించడం ఒక అరుదైన అవకాశమేనని భావిస్తా. అవకాశాలు వస్తున్నా ఒప్పుకోవడంలేదు.. ప్రస్తుతం శ్రీనగర్‌కాలనీలో నా నివాసం. ఎన్టీఆర్‌తో అప్పట్లో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ సినిమా షూటింగ్ సమయంలో బయట కూర్చుంటే నేను మాత్రం నేరుగా లోనికి వెళ్లేంత చొరవ ఉండేది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాలని అవకాశాలు వచ్చినా గుర్తుండిపోయేంత స్థాయిలో లేకపోవడంతో వేరేవి ఒప్పుకోలేదు. ఇప్పటికీ సినిమాల్లో అవకాశాల కోసం తనను కొందరు సంప్రదిస్తున్నా అంగీకరించడంలేదు. -
కనీస సమాచారం లేకపోతే ఎలా..!
నిజామాబాద్‌అర్బన్: జిల్లా ఉపాధి కల్పన అధికారి మోహన్‌లాల్ తీరుపై జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు, స్థాయీ సంఘ సభ్యులు మండిపడ్డారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్థాయీసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కల్పన శాఖపై సమీక్ష నిర్వహించారు. శాఖ ద్వారా చేపడుతున్న విధానాలను పేర్కొనాలని చైర్మన్ ఆదేశించారు. సం బంధిత అధికారి వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో చైర్మన్ సమావేశానికి వచ్చేటప్పుడు ఇలా గేనా వస్తారా అని ప్రశ్నించారు. ఎంప్లాయీమెం ట్ కార్యాలయంలో ఎన్ని ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. ఐదేళ్ల నుంచి ఎందుకు టెండర్లు వే యడం లేదంటూ ప్రశ్నించారు. తక్షణమే అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగిన సమీక్షలో ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడం, మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ నుంచి ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వ్యవసాయంపై సమీక్ష సమావేశం జరిగింది. రైతు బంధు పథకం అమలు, ప్రస్తుతం ఖరీఫ్‌కు పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ రజిత, సభ్యులు అధికారులు పాల్గొన్నారు. -
'అందరం కలిసికట్టుగా పనిచేస్తాం'
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీచైర్మన్‌గా దాదన్నగారి విఠల్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ శుక్రవారం ప్రమాణం చేశారు. కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు స్వయంగా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సభను హుందాతనంగా నడిపించాలి. అందరూ పోటి పడీ పనిచేయాలని, అర్థవంతమైన చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటలు పాటు కరెంటు అమలవడం, ఎకరాకు రూ.ఐదు వేలు ఇవ్వడం చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ఆశ్చర్యపోతున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సభా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని పోచారం పేర్కొన్నారు. 'స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని, దానికి తగ్గట్టే నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నార'ని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎస్సారెస్సీ పునరుజ్జీవం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. 'నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజల సమస్యలు తీర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని' నూతన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ తెలిపారు.కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు. -
కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్‌సభ మాజీ సభ్యుడు దేవరకొండ విఠల్ రావు (69) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, 2004 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి విఠల్ రావు లోక్ సభకు ఎన్నికయ్యారు. -
షెహన్ షా ఏ ఘజల్..
షెహన్ షా ఏ ఘజల్.. ఔను! ఘజల్ ప్రపంచానికి ఆయన మకుటం లేని మహారాజు. బాలీవుడ్ పుణ్యాన ‘ఘజల్ కింగ్స్’గా వెలుగొందిన గాయక దిగ్గజాలకు సైతం ఆయన గురుతుల్యుడు. బాంబేలో స్థిరపడితే అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయని ఎంతమంది ఎంతలా ఊరించినా, పుట్టిన నేల విడిచి సాము చేసేందుకు ఇష్టపడని అసలు సిసలు హైదరాబాదీ విఠల్‌రావు. చివరి నిజాం సంస్థానంలో చివరి ఆస్థాన గాయకుడు ఆయన. నిజాం రాజ్యం అంతరించింది కానీ, విఠల్‌రావు ఘజల్ సామ్రాజ్యం మాత్రం విస్తరించింది. ఆడుతూ పాడుతూ సాగే బాల్య దశలోనే పాట ఆయనను పెనవేసుకుంది. ఆ పాటే ఆయనను పట్టుమని పదమూడేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే నిజాం ఆస్థానం వరకు తీసుకుపోయింది. గోషామహల్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో తోటి విద్యార్థులకు ‘షాహే దక్కన్ జిందాబాద్’ అనే పాట నేర్పించాడు. ఆ పాట ప్రభావంతో ఆ నోటా ఆ నోటా విఠల్‌రావు పేరు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు వ్యాపించింది. విఠల్ నోట పాట వినాలని ముచ్చటపడ్డ నిజాం ప్రభువు కబురు పంపాడు. బెరుకు బెరుకుగానే నిజాం ఆస్థానంలో హాజరైన విఠల్, నెమ్మదిగా ధైర్యం కూడదీసుకుని గొంతెత్తి పాడాడు. ఆ పాటకు నిజాం ప్రభువు పరవశించాడు. పేరేమిటని అడిగాడు. ‘విఠల్‌రావు’ అని బదులివ్వడంతో ‘యే ఘజబ్ హై’ అంటూ ఆశ్చర్యపోయాడు. వరుసగా పదిరోజులు ఇదే తంతు సాగింది. విఠల్‌ను పిలిపించకుని, ఆయన పాట వినడం ‘యే ఘజబ్ హై’ అంటూ ఆశ్చర్యపోవడం. హిందువుల కుర్రాడికి అంత చక్కని ఉర్దూ ఉచ్చారణ ఎలా అబ్బిందనేదే నిజాం ప్రభువు ఆశ్చర్యానికి కారణం. నిజాం ప్రభువు అంతటితో సరిపెట్టుకోలేదు. విఠల్‌రావు ఇంటికి వెయ్యిరూపాయల నజరానా పంపాడు. నిజాం కుటుంబంతో అనుబంధం పదమూడేళ్ల బాల్యంలో నిజాం ప్రభువును మెప్పించిన విఠల్‌రావు, ఆయన ఆస్థానంలో చోటు సంపాదించుకోవడమే కాదు, అనతికాలంలోనే నిజాం కుటుంబానికి సన్నిహితుడయ్యాడు. నిజాం తనయులు టకీ జా బహదూర్, హస్మ్ జా బహదూర్లు నిర్వహించే మెహఫిల్ కార్యక్రమాల్లో విఠల్‌రావు గానం తప్పనిసరి అంశంగా ఉండేది. అప్పటి యువరాజు ప్రిన్స్ మొజాం జా బహదూర్ అయితే, విఠల్‌రావును తన కొడుకులతో సమానంగా ఆదరించాడు. నగర ప్రముఖులందరినీ ఆహ్వానించి ఏర్పాటు చేసిన ఒక పెద్ద పార్టీలో విఠల్‌రావును ప్రిన్స్ మొజాం జా ‘‘నా తనయుడు ‘విఠల్ జా’..’ అని పరిచయం చేశాడంటే, నిజాం కుటుంబంతో విఠల్‌రావు సాన్నిహిత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. పండిట్ లక్ష్మణ్‌రావు పంచ్‌పోటి, ఉస్తాద్ బడే గులాం అలీఖాన్, ఆయన సోదరుడు బర్కత్ అలీఖాన్ వంటి దిగ్గజాల వద్ద సంగీతం నేర్చుకున్న విఠల్‌రావును ఇప్పటికీ సీనియర్ ఘజల్ కళాకారులంతా గురుతుల్యుడిగా గౌరవిస్తారు. ఈ గాలి.. ఈ నేల.. ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు.. సెలయేరు.. అన్నట్లుగా విఠల్‌రావుకు హైదరాబాద్ నగరంపై, ఇక్కడి పరిసరాలపై అంతులేని మమకారం. నిజాం ఆస్థాన గాయకుడిగా వెలుగొందుతున్న కాలంలోనే ఆయన ప్రాభవం బాలీవుడ్ వరకు వ్యాపించింది. నౌషాద్, మహమ్మద్ రఫీ ఆయనను బాంబే వచ్చేయాలంటూ చాలా నచ్చచెప్పారు. ‘సుఖ్‌దుఃఖ్’ అనే సినిమాకు విఠల్‌రావు సంగీతం సమకూర్చారు. అందులో పాటలన్నీ బాగానే ఆదరణ పొందినా, ఆ సినిమా బాగా ఆడలేదు. మరికొన్ని సినిమా యత్నాలూ ఫలప్రదం కాలేదు. ‘హైదరాబాద్ మట్టిలో మహత్తు ఏదో ఉంది. దీనిని ఒకసారి అనుభవిస్తే, ఎవరూ దీనిని వదులుకోలేరు’ అనే విఠల్‌రావు, గత వైభవ నిదర్శనంగా తాను పుట్టిపెరిగిన గోషామహల్ ప్రాంతంలోనే ఇప్పటికీ ఉంటున్నారు. - పన్యాల జగన్నాథదాసు హైదరాబాదీ, పండిట్ విఠల్‌రావు