వైఎస్ జగన్ రాజీనామాను ఎందుకు తిరస్కరించారు?
ఏకారణం తెలుపకుండా రాజీనామాలను తిరస్కరించడంపై ప్రభుత్వ లాయర్ ను ఢిల్లీకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీకే జైన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లు రాజీనామాలు సమర్పించారు.
ముగ్గురు సమర్పించిన రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదని లాయర్ ను జైన్ ప్రశ్నించారు. రాజీనామాలను ఆమోదించకపోవడంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వం న్యాయవాది అదనపు సొలిసీటర్ జనరల్ మేరా బదులిచ్చారు.
ముగ్గురు ఎంపీలు వ్యక్తిగతంగా స్పీకర్ మీరాకుమార్ ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించమని కోరాలని న్యాయమూర్తి సూచించారు. రాజీనామాలు ఆమోదించకుంటే ఎంపీలకు వేరే మార్గం లేదనుకుంటున్నారా? ప్రభుత్వ న్యాయవాదిపై జస్టిస్ వి.కే జైన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పిటిషన్ పై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే.