జిల్లాలో రూ.3.64 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
సమిశ్రగూడెం (నిడదవోలురూరల్), న్యూస్‌లైన్: జిల్లాలో రూ.3.64 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి వి.నాగార్జునసాగర్ అన్నారు. మంగళవారం సమిశ్రగూడెం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2.63 కోట్లు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.1.01 కోట్లతో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పైపులైన్ల నిర్వాహణకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు.
దీంతోపాటు శాశ్వత ప్రాతిపదికన సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాజీవ్‌గాంథీ స్వశక్తి యోజనలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో 50 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసినట్టు నాగార్జునసాగర్ తెలిపారు. ఒక్కో భవన వ్యయం రూ.15 లక్షలుగా అంచనా సిద్ధం చేశామన్నారు. నిర్మల్‌భారత్ అభియాన్ పథకంలో భాగంగా అవసరమైన ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు పన్నులు వసూళ్లతో వనరులు సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. అనధికారికంగా నిర్వహించే పరిశ్రమలను గుర్తించి పన్నులు విధించడం ద్వారా పంచాయతీలు ఆదాయం రాబట్టుకోవాలన్నారు. 10వ తరగతిలో నూటికి నూరుశాతం మెరుగైన ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఎంఈవో వంగా సూర్యనారాయణమూర్తిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఎంపీడీవో ఎస్.నిర్మలజ్యోతి పాల్గొన్నారు.