vocational training
-
బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ
ఒడిశా,భువనేశ్వర్: రాష్ట్రంలో బిచ్చగాళ్ల నిర్మూలనకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మేరకు బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కల్పిస్తారు. ఈ వర్గానికి జీవనోపాధి వనరులతో పునరావాసం కల్పించే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక భద్రత–దివ్యాంగుల సాధికారత విభాగం మంత్రి అశోక్ చంద్ర పండా గురువారం తెలిపారు. పూరీ పట్టణంలో జగన్నాథ మందిరం, భువనేశ్వర్‌లో లింగరాజ్ దేవస్థానాన్ని బహుముఖంగా విస్తరించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రాలుగా ఆవిష్కరించేందుకు భారీ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చకచకా పనులు చేపడుతుంది. ఈ దేవస్థానాల ప్రాంగణాల్లో బిచ్చగాళ్లకు త్వరలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి వృత్తి శిక్షణ కల్పిచండం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుర్తించింది. తొలి విడతలో పూరీ, భువనేశ్వర్ ప్రాంతాల్లో బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల్లో రహదారుల పక్కన భిక్షాటన చేసే వారిని గుర్తించి శిక్షణ కేంద్రాలకు తరలిస్తారు. శిక్షణ అనంతరం వీరు చిరు వ్యాపారం వంటి వ్యాపకాలతో జీవనం సాగించేందుకు ప్రేరణగా ఈ శిక్షణ దోహదపడుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటనను నిర్మూలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లో బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. -
యువ క్రికెటర్లకు సామాజిక శిక్షణ
న్యూఢిల్లీ: సచిన్‌ను చూసి బ్యాట్ పట్టడం, ధోనిని చూసి వికెట్ కీపర్ కావడం... క్రికెటే లోకమనుకుంటున్న టీనేజ్ క్రికెటర్ల సామాజిక వికాసానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టనుంది. భారత్ ‘ఎ’, అండర్–19 జట్లను విశేషంగా తీర్చిదిద్దుతున్న కోచ్ ద్రవిడ్ ఇటీవల కుర్రాళ్లలో క్రికెట్‌తో పాటు సామాజిక ప్రవర్తనను మెరుగు పరచాలని సూచించారు. వారి దైనందిన జీవన వికాసానికి, భవిష్యత్తుకు ఉపయోగపడేలా కుర్ర క్రికెటర్లకు ఒకేషనల్ ట్రెయినింగ్ ఇస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... ద్రవిడ్ సూచనలకు మద్దతు తెలిపారు. అండర్–16 ఆటగాళ్లకు క్రికెట్ తప్ప మరే ధ్యాస ఉండటం లేదని అర్థమైందని, దీంతో బోర్డు వారి క్రికెట్, క్రికెటేతర భవిష్యత్తుకు బంగారుబాట పరిచేందుకు సిద్ధంగా ఉందన్నారు. -
విషాహారం తిని 35 మందికి అస్వస్థత
వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో అపశ్రుతి కర్నూలు(హాస్పిటల్): విషాహారం తిని 35 మంది యువతీయువకులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శనివారం కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం యువతీయువకులకు వృత్తివిద్యల్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి చూపుతోంది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కర్నూలు నగర పరిసరాల్లో ఆరు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో నాగిరెడ్డి రెవిన్యూకాలనీలో స్టీప్ కెరియర్ బిల్డర్స్ అనే సంస్థ యువతీయువకులకు సీసీఈ రిటైలర్‌లో శిక్షణ ఇస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ భోజన, వసతితో సహా మూడు నెలల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం ఇందులో 150 మందికి పైగా యువతీయువకులకు జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతున్న వారు గత రెండురోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గురువారం పలువురు విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందగా, శుక్రవారం సైతం మరికొందరు ఆసుపత్రిలో చేరారు. మొత్తంగా 35 మంది యువతీ యువకులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికితోడు రెగ్యులర్‌గా వచ్చే తాగునీరు గాకుండా ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి ఇవ్వడం కూడా సమస్యగా మారినట్లు చెబుతున్నారు. అస్వస్థకు గురైన వారిలో కర్నూలు మండలం ఆర్కె దుద్యాల గ్రామానికి చెందిన ఎం. రాజ్‌కుమార్, కె. అశోక్, ప్రసాద్, ప్రసాద్, రవికుమార్, మధు, సుంకన్న, ప్రవీణ్, పత్తికొండ మండలం చందోళి గ్రామానికి చెందిన శేఖర్, ఎం. శేఖర్, నంద్యాల మండలం కరిమద్దుల గ్రామానికి చెందిన కె. రాజేష్, ధనలక్ష్మి, కె.జయంతి, హెబ్సిబా, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఎం. గిడ్డయ్య, బనగానపల్లికి చెందిన అనంతయ్య, ఓర్వకల్లుకు చెందిన అశోక్, బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన రమేష్ ఉన్నారు. వీరిలో 11 మందికి తీవ్ర అస్వస్థతగా ఉంటే అంటు వ్యాధుల విభాగంలో చేర్పించారు.