విషాహారం తిని 35 మందికి అస్వస్థత
విషాహారం తిని 35 మందికి అస్వస్థత
Published Fri, May 12 2017 9:58 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో అపశ్రుతి
కర్నూలు(హాస్పిటల్): విషాహారం తిని 35 మంది యువతీయువకులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శనివారం కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం యువతీయువకులకు వృత్తివిద్యల్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి చూపుతోంది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో కర్నూలు నగర పరిసరాల్లో ఆరు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో నాగిరెడ్డి రెవిన్యూకాలనీలో స్టీప్ కెరియర్ బిల్డర్స్ అనే సంస్థ యువతీయువకులకు సీసీఈ రిటైలర్‌లో శిక్షణ ఇస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ భోజన, వసతితో సహా మూడు నెలల పాటు కొనసాగుతుంది.
ప్రస్తుతం ఇందులో 150 మందికి పైగా యువతీయువకులకు జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతున్న వారు గత రెండురోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గురువారం పలువురు విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందగా, శుక్రవారం సైతం మరికొందరు ఆసుపత్రిలో చేరారు. మొత్తంగా 35 మంది యువతీ యువకులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికితోడు రెగ్యులర్‌గా వచ్చే తాగునీరు గాకుండా ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి ఇవ్వడం కూడా సమస్యగా మారినట్లు చెబుతున్నారు.
అస్వస్థకు గురైన వారిలో కర్నూలు మండలం ఆర్‌కె దుద్యాల గ్రామానికి చెందిన ఎం. రాజ్‌కుమార్, కె. అశోక్, ప్రసాద్, ప్రసాద్, రవికుమార్, మధు, సుంకన్న, ప్రవీణ్, పత్తికొండ మండలం చందోళి గ్రామానికి చెందిన శేఖర్, ఎం. శేఖర్, నంద్యాల మండలం కరిమద్దుల గ్రామానికి చెందిన కె. రాజేష్, ధనలక్ష్మి, కె.జయంతి, హెబ్సిబా, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఎం. గిడ్డయ్య, బనగానపల్లికి చెందిన అనంతయ్య, ఓర్వకల్లుకు చెందిన అశోక్, బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన రమేష్ ఉన్నారు. వీరిలో 11 మందికి తీవ్ర అస్వస్థతగా ఉంటే అంటు వ్యాధుల విభాగంలో చేర్పించారు.
Advertisement
Advertisement