vs prasad
-
సెర్చ్ కమిటీలో మార్పు
- తెయూ వర్సిటీ నామినీగా ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ - నెల రోజుల్లో తెయూ వీసీ నియామకం - వీసీ కోసం 162 దరఖాస్తులు - జూలై 15న భేటీ కానున్న సెర్చ్ కమిటీ - ఆశావహుల పైరవీలు షురూ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎంపిక కోసం గతంలో నియమించిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. గతంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రతినిధిగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తిని తొలగించి, ఆయన స్థానంలో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.శివలింగ ప్రసాద్‌ను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ యూనివర్సిటీ ప్రతినిధిగా వి.శివలింగ ప్రసాద్, యూజీసీ ప్రతినిధిగా యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సృజన్దాస్, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను సభ్యులుగా నియమిస్తూ శనివారం ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. నూతన సెర్చ్ కమిటీ జూలై 15 న సమావేశం అవుతుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ సమావేశం ఈ నెల 21న జరిగిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని ఓయూ, కేయూ, జేఎన్టీయూహెచ్, బీఆర్ అంబేద్కర్, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. వీసీల ఎంపిక ప్రక్రియను జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం. ప్రొఫెసర్ లింగమూర్తి మార్పు వెనుక.. తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రకటించిన సెర్చ్ కమిటీలో కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తి, తెయూ ప్రతినిధిగా ఉన్నారు. అయితే ప్రొఫెసర్ లింగమూర్తి సైతం వీసీ రేసులో ఉన్నారు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలతో పాటు మరో యూనివర్సిటీ వీసీ కోసం లింగమూర్తి దరఖాస్తు చేసుకున్నారు. వీసీ రేసులో ఉన్న వ్యక్తి మరో యూనివర్సిటీ వీసీ సెర్చ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగించడం సమంజసం కాదని ఆలోచించిన ప్రభుత్వం ఆయనను తొలగించినట్లు తెలిసింది. ఆయన స్థానంలో తెయూ ప్రతినిధిగా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్‌ను నియమించింది. సెర్చ్ కమిటీ సభ్యులు జూలై 15న సమావేశం నిర్వహించి వీసీ కోసం అందిన దరఖాస్తుల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, వారి పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ ముగ్గురిలో నుంచి ఒకరిని ప్రభుత్వం తెయూ వీసీగా నియమిస్తుంది. సెర్చ్‌కమిటీ సమావేశం తేదీ ఖరారు కావడంతో వీసీ నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. నెల రోజుల్లో .. మరో నెల రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి పాలన నుంచి బయట పడనుంది. రెండు సంవత్సరాలుగా ఇన్చార్జి వీసీల పాలనలో కొనసాగుతున్న తెయూకు త్వరలో శాశ్వత వీసీ రానున్నారు. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పని చేసి ఉండాలన్న ప్రధానమైన నిబంధన గతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించి ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు అర్హులుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీసీగా పని చేయడానికి ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్లయింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు పలువురు పెద్ద సంఖ్యలో వీసీ పోస్టు కోసం దరఖాస్తులు చేశారు. తెయూ వీసీ కోసం 162 దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ప్రొఫెసర్ సాయిలు.. తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలకు రిజిస్ట్రార్‌గా పని చేసిన ప్రొఫెసర్ సాయిలు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సాయిలు, ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగి ఉన్నారు. ఆయన బలమైన లాబీయింగ్ కలిగి ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ ఆచార్యుడిగా పని చేస్తున్నారు. ప్రొఫెసర్ సీతారామారావు.. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామరావు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రొఫెసర్ భూపతిరావు.. కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ భూపతిరావు బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయనకు రాష్ట్రంలోని ఏదోక యూనివర్సిటీకీ వీసీ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓయూ వీసీగా లేదంటే తెయూ వీసీగా ఈయన పేరు ‘ఫైనల్ త్రీ’ లో ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రొఫెసర్ సాయన్న.. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జిల్లా వాసి సాయన్న తెయూ వీసీగా పని చేసేందుకు బరిలో నిలిచారు. జిల్లాలోని కోటగిరి ప్రాంతానికి చెందిన ఈయనకు జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రొఫెసర్ శ్యామలా రాథోడ్.. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్యామలా రాథోడ్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎస్టీ మహిళ కోటాలో వీసీ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్ దామోదర్ రావు.. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ దామోదర్ రావు సైతం రేసులో ఉన్నారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఏది ఏమైనా జిల్లా పరిస్థితులు, యూనివర్సిటీ పరిస్థితులు సంపూర్ణంగా అవగాహన కలిగి ఉన్న ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్ణయమే వీసీ ఎంపికలో కీలకం కానుంది. ఈ రకంగా చూసుకుంటే ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి రేసులో ముందు వరసలో ఉండే అవకాశాలున్నాయి. లాబీయింగ్, డబ్బులు ప్రధాన పాత్ర పోషించే అవకాశం.. ఏది ఏమైనా ఈసారి వీసీ ఎంపికలు పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే నిబంధనలు సడలించడంతో వీసీ పోస్టుల కోసం ఆశావహులు పెరగడం వల్ల తీవ్రమైన పోటీ నెలకొంది. రాజకీయంగా బలమైన లాబీయింగ్‌తో పాటు డబ్బులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వీసీ పోస్టు కనీసం రూ.30 - 40 లక్షలు పలికే అవకాశం ఉన్నట్లు వర్సిటీ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. గతంలో వీసీ లుగా.. తెలంగాణ యూనివర్సిటీ వీసీలుగా గతంలో ప్రొఫెసర్ కాశీరాం (ఎస్సీ(మాల), మహమ్మద్ అక్బర్ అలీఖాన్ (మైనార్టీ) పని చేశారు. ఇప్పుడు వీసీ పదవి ఏ సామాజిక వర్గాన్ని వరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది. తెయూ వీసీ రేసులో లింబాద్రి తెయూ వీసీ ఎంపికలో అందరి కంటే ముందు వరసలో ప్రస్తుత ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేరు వినిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా ఇన్చార్జి వీసీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సి పార్థసారథితో కలిసి వర్సిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి కలిసి వచ్చేలా ఉంది. వర్సిటీలో నిరంతర విద్యుత్ సరఫరా, రక్షిత తాగునీటి సరఫరా, ఆధునిక సెంట్రల్ లైబ్రరీ, ఉచిత వై-ఫై ఇంటర్నెట్, అన్నింటికి మించీ ‘నాక్’ గుర్తింపు రావడంలో రిజిస్ట్రార్ లింబాద్రి చేసిన కృషి ఆయనను రేసులో ముందు వరసలో నిలిపే అవకాశం ఉంది. దీనికి తోడు జిల్లా వాసి (స్థానికుడు) కావడం, స్థానిక రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆశీస్సులు ఉండటం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లింబాద్రి తెయూ రిజిస్ట్రార్‌గా రెండు సార్లు పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. -
టీడీపీలో ‘క్లబ్’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం ఆఫీసర్స్ క్లబ్‌లోని వ్యవహారాలు టీడీపీ నేతల మధ్య చిచ్చురేపుతున్నాయి. అటు క్లబ్ కార్యదర్శి సాంబరాజు, క్లబ్ సభ్యుడు గోపీరాజు మధ్య, ఇటు గోపీరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ వీఎస్ ప్రసాద్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఆఫీసర్ క్లబ్ కార్యదర్శిగా సాంబరాజు, క్లబ్ సభ్యునిగా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద పీఏగా వ్యవహరిస్తున్న గోపీ రాజు కొనసాగుతున్నారు. సాంబరాజు కార్యదర్శిగా కొనసాగడం ఇష్టం లేకనో, క్లబ్ ఆస్తులు ఆక్రమణల వెనుక సాంబరాజు ఉన్నారన్న అనుమానమో తెలియదు గానీ, గోపీరాజు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. క్లబ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణదారులకు నోటీసులిచ్చి స్వాధీనం చేసుకోవాలని క్లబ్ కార్యదర్శికి తెలియకుండా, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లకుండా నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు గోపీరాజు ఫిర్యాదు చేసినట్టు, ఆ మేరకు అధికార వర్గాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి సర్వే చేసి, నోటీసులు జారీ చేశారని గోపీరాజు వ్యతిరేక వర్గం భావిస్తోంది. తనకు తెలియకుండా ఫిర్యాదులివ్వడం, నోటీసులు జారీ చేయించడమేంటని గోపీరాజును క్లబ్ కార్యదర్శి సాంబరాజు నిలదీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఆక్రమణగా చెబుతున్నవి ఆఫీసర్ క్లబ్ స్థలాలు కావని, గతంలో వేసిన లేఅవుట్ ద్వారా మున్సిపాల్టీకి సంక్రమించిన సామాజిక అవసరాల స్థలమని, తమకు తెలియకుండా వార్డు పరిధిలో గల విషయాలపై గోపీరాజు పెత్తనమేంటని స్థానిక కౌన్సిలర్ కొర్నాన రాజ్యలక్ష్మీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ స్థలాల్ని కాపాడాలనే ఉద్దేశమే ఉంటే ఆక్రమణదారులందరికీ నోటీసులిప్పించాలని, కొందరికిచ్చి మరికొందర్ని వదిలేయడమేంటని, స్వార్ధపూరితంగా వ్యవహరించడం తగదని గోపీరాజు తీరును టీడీపీకి చెందిన కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అక్కడొక భవనానికి సంబంధించిన వ్యక్తులను పార్టీ రాజకీయాలకు బాగా ఉపయోగించుకుని, ఇప్పుడు వారి భవనంపైనే కక్ష సాధించడం వెనుక ఉద్దేశమేంటని డాక్టర్ విఎస్ ప్రసాద్ అభ్యంతరం తెలుపుతున్నారు. ఇదే విషయమై అశోక్ బంగ్లాలో గోపీరాజుతో డాక్టర్ విఎస్ ప్రసాద్, స్థానిక కౌన్సిలర్ రాజ్యలక్ష్మీ వాదనకు దిగారు. తీవ్రస్థాయిలో మాటలు విసురుకున్నారు. ఇలాగైతే పార్టీలో ఇబ్బందులొస్తాయని, ఏళ్ల తరబడి పార్టీలో పనిచేసిన వారితో మాట్లాడేది ఇలాగేనా అని వీఎస్ ప్రసాద్ స్వరం పెంచినట్టు తెలిసింది. మొత్తానికి గోపీరాజును అటు సాంబరాజు, ఇటు విఎస్ ప్రసాద్ తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు. ఆయన పెత్తనమేంటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని అటు పార్టీలోనూ, ఇటు ఆఫీసర్ క్లబ్‌లోనూ విసృ్తత చర్చ నడుస్తోంది. ఇదే విషయమై గోపీరాజును ‘సాక్షి’ వివరణ కోరగా తానెటువంటి ఫిర్యాదులు చేయలేదని, క్లబ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్న ఆవేదన మాత్రం ఉందని, ఉన్నతాధికారుల చేత నోటీసులు ఇప్పించడంలో తన ప్రమేయం లేదని తెలిపారు. క్లబ్ కార్యదర్శి సాంబరాజును వివరణ కోరగా తనను లక్ష్యంగా చేసుకుని గోపీరాజు పావులు కదుపుతున్నారని, క్లబ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని తనకు తెలియకుండా ఫిర్యాదులు చేశారని, ఇదే విషయంలో తమ మధ్య వాదోపవాదాలు జరిగాయని చెప్పారు. డాక్టర్ వి.ఎస్.ప్రసాద్‌ను వివరణ కోరగా మున్సిపాల్టీ స్థలాలపై గోపీరాజు తీరు సరికాదని, ఆక్రమణలుంటే తొలగించాల్సిన బాధ్యత మున్సిపాల్టీదని, కౌన్సిలర్‌కు తెలియకుండా ఆయన నేరుగా మున్సిపల్ అధికారులపై ఒత్తిడి చేయించి నోటీసులు జారీ చేయించడం మంచిది కాదన్నారు. -
మహిళలు అభివృద్ధి సాధించాలి
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అక్బర్‌అలీఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలో ‘అధికార వికేంద్రీకరణ, మహిళ సాధికారత’ అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీసీ మాట్లాడుతూ మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమవుతూ భర్తచాటున అన్నట్లు ఉంటున్నారన్నారు. మహిళలకు కల్పిస్తున్న అవకాశాలు, రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో తమకంటూ ప్రత్యేకతను చాటాలన్నారు. సమాన హక్కులు, న్యాయం మహిళలు పొందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు సమాజసేవలో ముందుకు రావాలన్నారు. తద్వారా అవగాహన పెరిగి అభివృద్ధి సాధిస్తారన్నారు. వీరి అవకాశాలను పురుషులు అడ్డుకోకుండా చూడాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమాజ అవగాహన తప్పనిసరి అన్నారు. మహిళలకు అధికార వికేంద్రీకరణ అంటే ఏంటో పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు కల్పిస్తున్న అవకాశాలు బాగున్నాయన్నారు. ఈ సదస్సు కళాశాల యువతులు నిర్వహించడం బాగుందన్నారు. ఉపయోగిస్తేనే ప్రయోజనం.. అనంతరం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ వీసీ వీఎస్.ప్రసాద్ మాట్లాడారు. మహిళలు అభివృద్ధిని సాధించాలంటే వారిలో ఆత్మస్థైర్యం పెరగాలన్నారు. అయితేనే వారికి కల్పించిన సౌకర్యాలు, రిజర్వేషన్లు, హక్కులు సక్రమంగా వినియోగించబడి వారి అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారు పూర్తి స్థాయిలో వాటిని తమకు తామే వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. మహిళల స్థానంలో మరొకరు జోక్యం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే మహిళలు అభివృద్ధిని సాధిస్తారన్నారు. సదస్సులో వివిధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, మహిళ కళాశాల చైర్మన్ నారాయణ రెడ్డి, మహిళ సర్పంచులు, విద్యార్థినులు, కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్, అధ్యాపకురాలు వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.