నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అక్బర్‌అలీఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలో ‘అధికార వికేంద్రీకరణ, మహిళ సాధికారత’ అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
వీసీ మాట్లాడుతూ మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమవుతూ భర్తచాటున అన్నట్లు ఉంటున్నారన్నారు. మహిళలకు కల్పిస్తున్న అవకాశాలు, రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో తమకంటూ ప్రత్యేకతను చాటాలన్నారు. సమాన హక్కులు, న్యాయం మహిళలు పొందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు సమాజసేవలో ముందుకు రావాలన్నారు. తద్వారా అవగాహన పెరిగి అభివృద్ధి సాధిస్తారన్నారు.
వీరి అవకాశాలను పురుషులు అడ్డుకోకుండా చూడాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమాజ అవగాహన తప్పనిసరి అన్నారు. మహిళలకు అధికార వికేంద్రీకరణ అంటే ఏంటో పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు కల్పిస్తున్న అవకాశాలు బాగున్నాయన్నారు. ఈ సదస్సు కళాశాల యువతులు నిర్వహించడం బాగుందన్నారు.
ఉపయోగిస్తేనే ప్రయోజనం..
అనంతరం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ వీసీ వీఎస్.ప్రసాద్ మాట్లాడారు. మహిళలు అభివృద్ధిని సాధించాలంటే వారిలో ఆత్మస్థైర్యం పెరగాలన్నారు. అయితేనే వారికి కల్పించిన సౌకర్యాలు, రిజర్వేషన్లు, హక్కులు సక్రమంగా వినియోగించబడి వారి అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారు పూర్తి స్థాయిలో వాటిని తమకు తామే వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.
మహిళల స్థానంలో మరొకరు జోక్యం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే మహిళలు అభివృద్ధిని సాధిస్తారన్నారు. సదస్సులో వివిధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, మహిళ కళాశాల చైర్మన్ నారాయణ రెడ్డి, మహిళ సర్పంచులు, విద్యార్థినులు, కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్, అధ్యాపకురాలు వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అభివృద్ధి సాధించాలి
Published Fri, Feb 7 2014 1:59 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement