సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం ఆఫీసర్స్ క్లబ్‌లోని వ్యవహారాలు టీడీపీ నేతల మధ్య చిచ్చురేపుతున్నాయి. అటు క్లబ్ కార్యదర్శి సాంబరాజు, క్లబ్ సభ్యుడు గోపీరాజు మధ్య, ఇటు గోపీరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ వీఎస్ ప్రసాద్ మధ్య విభేదాలు పొడచూపాయి.
ఆఫీసర్ క్లబ్ కార్యదర్శిగా సాంబరాజు, క్లబ్ సభ్యునిగా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద పీఏగా వ్యవహరిస్తున్న గోపీ రాజు కొనసాగుతున్నారు. సాంబరాజు కార్యదర్శిగా కొనసాగడం ఇష్టం లేకనో, క్లబ్ ఆస్తులు ఆక్రమణల వెనుక సాంబరాజు ఉన్నారన్న అనుమానమో తెలియదు గానీ, గోపీరాజు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. క్లబ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణదారులకు నోటీసులిచ్చి స్వాధీనం చేసుకోవాలని క్లబ్ కార్యదర్శికి తెలియకుండా, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లకుండా నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు గోపీరాజు ఫిర్యాదు చేసినట్టు, ఆ మేరకు అధికార వర్గాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి సర్వే చేసి, నోటీసులు జారీ చేశారని గోపీరాజు వ్యతిరేక వర్గం భావిస్తోంది. తనకు తెలియకుండా ఫిర్యాదులివ్వడం, నోటీసులు జారీ చేయించడమేంటని గోపీరాజును క్లబ్ కార్యదర్శి సాంబరాజు నిలదీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
ఆక్రమణగా చెబుతున్నవి ఆఫీసర్ క్లబ్ స్థలాలు కావని, గతంలో వేసిన లేఅవుట్ ద్వారా మున్సిపాల్టీకి సంక్రమించిన సామాజిక అవసరాల స్థలమని, తమకు తెలియకుండా వార్డు పరిధిలో గల విషయాలపై గోపీరాజు పెత్తనమేంటని స్థానిక కౌన్సిలర్ కొర్నాన రాజ్యలక్ష్మీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ స్థలాల్ని కాపాడాలనే ఉద్దేశమే ఉంటే ఆక్రమణదారులందరికీ నోటీసులిప్పించాలని, కొందరికిచ్చి మరికొందర్ని వదిలేయడమేంటని, స్వార్ధపూరితంగా వ్యవహరించడం తగదని గోపీరాజు తీరును టీడీపీకి చెందిన కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అక్కడొక భవనానికి సంబంధించిన వ్యక్తులను పార్టీ రాజకీయాలకు బాగా ఉపయోగించుకుని, ఇప్పుడు వారి భవనంపైనే కక్ష సాధించడం వెనుక ఉద్దేశమేంటని డాక్టర్ విఎస్ ప్రసాద్ అభ్యంతరం తెలుపుతున్నారు.
ఇదే విషయమై అశోక్ బంగ్లాలో గోపీరాజుతో డాక్టర్ విఎస్ ప్రసాద్, స్థానిక కౌన్సిలర్ రాజ్యలక్ష్మీ వాదనకు దిగారు. తీవ్రస్థాయిలో మాటలు విసురుకున్నారు. ఇలాగైతే పార్టీలో ఇబ్బందులొస్తాయని, ఏళ్ల తరబడి పార్టీలో పనిచేసిన వారితో మాట్లాడేది ఇలాగేనా అని వీఎస్ ప్రసాద్ స్వరం పెంచినట్టు తెలిసింది. మొత్తానికి గోపీరాజును అటు సాంబరాజు, ఇటు విఎస్ ప్రసాద్ తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు. ఆయన పెత్తనమేంటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని అటు పార్టీలోనూ, ఇటు ఆఫీసర్ క్లబ్‌లోనూ విసృ్తత చర్చ నడుస్తోంది.
ఇదే విషయమై గోపీరాజును ‘సాక్షి’ వివరణ కోరగా తానెటువంటి ఫిర్యాదులు చేయలేదని, క్లబ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్న ఆవేదన మాత్రం ఉందని, ఉన్నతాధికారుల చేత నోటీసులు ఇప్పించడంలో తన ప్రమేయం లేదని తెలిపారు. క్లబ్ కార్యదర్శి సాంబరాజును వివరణ కోరగా తనను లక్ష్యంగా చేసుకుని గోపీరాజు పావులు కదుపుతున్నారని, క్లబ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని తనకు తెలియకుండా ఫిర్యాదులు చేశారని, ఇదే విషయంలో తమ మధ్య వాదోపవాదాలు జరిగాయని చెప్పారు. డాక్టర్ వి.ఎస్.ప్రసాద్‌ను వివరణ కోరగా మున్సిపాల్టీ స్థలాలపై గోపీరాజు తీరు సరికాదని, ఆక్రమణలుంటే తొలగించాల్సిన బాధ్యత మున్సిపాల్టీదని, కౌన్సిలర్‌కు తెలియకుండా ఆయన నేరుగా మున్సిపల్ అధికారులపై ఒత్తిడి చేయించి నోటీసులు జారీ చేయించడం మంచిది కాదన్నారు.
టీడీపీలో ‘క్లబ్’ చిచ్చు
Published Fri, Jun 19 2015 12:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement