VSR Murthy
-
ఏపీ తీరానికి ఉగ్ర ముప్పు లేదు..
కోస్ట్‌గార్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీఎస్ఆర్ మూర్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని కోస్ట్‌గార్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీఎస్ఆర్ మూర్తి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ నౌకలు, విమానాలు ఏపీ తీరప్రాంతాన్ని అనుక్షణం గస్తీ కాస్తుంటాయని తెలిపారు. భారతదేశానికి 7,516 కిలోమీటర్ల విస్తారమైన తీర ప్రాంతముందని, ఇదే మాదక ద్రవ్యాల రవాణాకు ప్రధాన కారణమని చెప్పారు. తీర ప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏపీ తీరప్రాంతానికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని, విశాఖ, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నంలో కోస్ట్‌గార్డ్ స్టేషన్లున్నాయని పేర్కొన్నారు. తమ నౌకలు, విమానాలు ఏపీ తీరప్రాంతాన్ని అనుక్షణం గస్తీ కాస్తుంటాయని, విశాఖ సమీపంలోని నౌకాదళ స్థావరాలు, కాకినాడ సమీపంలోని చమురు ఉత్పత్తి, శుద్ధి కేంద్రాలకు రక్షణ చాలా అవసరమని వివరించారు. -
కోస్ట్ గార్డ్ అడిషనల్ డీజీగా తెలుగు తేజం
న్యూఢిల్లీ: భారత సముద్ర తీర రక్షణ దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా తెలుగు వ్యక్తి వీఎస్ఆర్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం తాలూకా ఉంగుటూరులో జన్మించారు. మూర్తి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ విద్యాభ్యాసం చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1984లో కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా చేరారు. 32 ఏళ్ల సుదీర్ఘ పదవీ కాలంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.2009లో ఫ్లాగ్ ర్యాంక్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందిన మూర్తి.. కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగానికి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (ఆపరేషన్స్, సముద్ర తీర భద్రత)గా పనిచేశారు. 2012లో అండమాన్, నికోబార్ రీజియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్‌గా, 2014లో నార్త్ ఈస్ట్ రీజియన్ కమాండెంట్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ‘బెస్ట్ షిప్’ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి కోస్ట్ గార్డ్ పతకం (విశిష్ట సేవ), 2003లో కోస్ట్ గార్డ్ పతకం (శౌర్యం) అందుకున్నారు.