‘కూలి’న బతుకు..!
టెక్కలి, న్యూస్‌లైన్: రోడ్డు విస్తరణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అక్కడే పనులు చేపడుతున్న ఓ కూలి దుర్మరణం పాలయ్యాడు. టెక్కలి పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా..పెట్రోల్ బంక్ ఎదురుగా జేసీబీతో పనులు చేపడుతుండగా..సత్తారు లోకనాథం కళ్యాణ మండపానికి చెందిన గోడ హఠాత్తుగా కూలిపోయింది. అక్కడే పనిచేస్తున్న కోటబొమ్మాళి మండలం సరియాపల్లి గ్రామానికి చెందిన కూలి బెండి ఆనంద్(48) దుర్మరణం పాలవగా..టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన సూపర్వైజర్ బెండి ఆనంద్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరూ గోడ శకలాల కింద ఇరుక్కుపోయారు. అక్కడే పనిచేస్తున్న తోటి కూలీలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, వారిని బయటకు తీశారు. వెంటనే క్షతగాత్రులిద్దరినీ ఆటోలో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు కె.కేశవరావు, శ్రీనుబాబు వైద్య సేవలు అందించారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందజేశారు. అప్పటికే.. కూలీ ఆనంద్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అతనిని తీసుకువెళ్తుండగా..మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని టెక్కలి పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలియడంతో మృతుని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.