వివాహిత ఆత్మ'హత్య'
► హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
► ఆత్మహత్య చేసుకుందంటూ పుట్టింటికి తప్పుడు సమాచారం
► మా బిడ్డను భర్త, అత్తమామలే కొట్టి చంపారని హతురాలి తండ్రి ఆరోపణ
► అనుమానాలు బలం చేకూర్చుతున్న నిందితుల పరారీ ఉదంతం
అనంతపురం: హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరించిన సంఘటన అమరాపురం మండలంలోని వీరాపురంలో వెలుగులోకి వచ్చింది. సుధ(33) అనే వివాహిత ఆత్మ'హత్య' కలకలం రేపింది. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ఉరికి వేలాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి ఒళ్లంతా గాయాలుండడం. భర్త, అత్త, మామ పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇది కచ్చితంగా హత్యేనని మృతురాలి తండ్రి సహా బంధువులు, గ్రామస్తులు అంటున్నారు. గ్రామానికి చెందిన బొప్పన్న కుమార్తె సుధ వివాహం వీరాపురం గ్రామానికి చెందిన రంగస్వామితో పదేళ్ల కింద జరిగింది. వారికి రాకేశ్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లైనప్పటి నుంచి దంపతులు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు.అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
ఉగాదికి ఊరికొచ్చి...
ఉగాది పండుగ కోసం సుధ, రంగస్వామి, వారి కుమారుడు వీరాపురానికి మంగళవారం వచ్చారు. గురువారం ఆమె తన పుట్టింటికెళ్లింది. భర్త పిలుపుతో ఆమె తన కుమారుడు, మరో బంధువుతో కలసి వీరాపురానికి శుక్రవారం సాయంత్రం బైక్‌లో వచ్చింది.
అంతలోనే ఆత్మహత్య అంటూ ఫోన్..
శనివారం తెలతెలవారుతుండగానే అల్లుడి నుంచి బొప్పన్నకు ఫోన్ వచ్చింది. మీ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ తెలిపాడు. బొప్పన్న సహా బంధువులు వెంటనే బయలుదేరి వీరాపురం చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై గాయాలుండడం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. తమ బిడ్డను అల్లుడు, అత్త, మామలే కొట్టి చంపేశారని బొప్పన్న ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన రాతమూలకంగా ఏఎస్ఐ ఈరన్నకు ఫిర్యాదు చేశారు.
నిందితుల పరారీ
మృతదేహాన్ని వదిలేసి రంగస్వామి, అతని తల్లిదండ్రులు పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చింది. ఇది కచ్చితంగా హత్యేనని గ్రామస్తులు కూడా ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మడకశిర ఆస్పత్రికి తరలించారు.