పాక్ యువ సంచలనం షహీన్
దుబాయ్ : వసీం అక్రం, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది వంటి దిగ్గజాలు తమ ప్రదర్శనతో పాకిస్తాన్ క్రికెట్ బౌలింగ్‌కు పర్యాయ పదాలుగా నిలిచారు. ఇప్పుడు మరో ‘ఆఫ్రిది’ తెరపైకి వచ్చాడు. తన ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో లాహోర్ క్వాలాండర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే షహీన్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లను సంధించడంలోనూ దిట్ట. షహీన్‌కు ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆదర్శం. వసీం అక్రమ్ తరహాలో ఎడమ చేతి వాటం బౌలర్. ఇక్కడ వసీం లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైతే, షహీన్ది లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్.
లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. ఇలా తన అద్భుత ప్రదర్శనతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును 114 పరుగులకే కట్టడి చేశాడు.
ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు.
అనతికాలంలోనే పాకిస్తాన్ క్రికెట్లోకి దూసుకొచ్చిన 17 ఏళ్ల యువ సంచలనం షహీన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా బాగానే సంపాదించుకున్నాడు. అందులో పాక్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఉండటం విశేషం. ‘ ఒక కొత్త స్టార్ జన్మించాడు.. 17 ఏళ్ల షహీన్ ఆఫ్రిది పీఎస్ఎల్లో 5 వికెట్లు తీసిన యువ ఆటగాడు.. 22 బంతులు విసిరితే అందులో 18 డాట్ బాల్స్ ఉండటం అతని అద్భుత ప్రదర్శనకు నిదర్శనం.. ’అని అతని బౌలింగ్‌కు ఫిదా అయిన రమీజ్ రాజా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.
A new star is born .. 17 year old Shaheen Afridi is youngest to 5 wickets in HBLPSL.. a triple wicket maiden over and 18 dots out of 22 bowled .. you kidding me..
— Ramiz Raja (@iramizraja) March 9, 2018