Way Bill
-
ఫిబ్రవరి 1 నుంచి జీఎస్టీ ఈ–వే బిల్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే ఫిబ్రవరి 1 నుంచి ఎలక్ట్రానిక్ వే (ఈ–వే) బిల్లు తప్పనిసరని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఒకే రాష్ట్రంలో రవాణాకు ఈ–వే బిల్లులను ఎప్పుడు అమలుచేయాలనే విషయం రాష్ట్రాలకే వదిలేస్తున్నామనీ, ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 మధ్య వారు ఎప్పుడైనా ఈ–వే బిల్లులను తప్పనిసరి చేయొచ్చని ఆయన వెల్లడించారు. ఈ–వే బిల్లులు జారీ చేసేందుకు తగిన సాంకేతిక వ్యవస్థ సిద్ధం కాకపోవడంతో దీన్ని ఇన్నాళ్లూ వాయిదా వేశారు. -
50వేలు దాటితేనే వేబిల్లు
కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లు గడువు విధింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే సరుకులకు సంబంధించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వేబిల్లు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. రవాణా వాహనంలోని సరుకుల విలువ రూ.50వేలు దాటితే కచ్చితంగా వేబిల్లు తీసుకో వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. గతంలో అమల్లో ఉన్న వ్యాట్ ప్రకారం వాహనంలోని సరుకుల విలువకు సంబంధం లేకుండా ఉండేది. ఒరిజినల్ వేబిల్లుతో పాటు డూప్లికేట్ కాపీ కూడా వాహనంలో ఉండాలని, అధికారులు తనిఖీ చేసినప్పుడు ఒరిజినల్ వేబిల్లు ను తీసుకుంటారన్నారు. అదే విధంగా కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లుల గడువు కూడా విధించారు. 100 కిలో మీటర్ల లోపు 2 రోజులు, 500 కి.మీ లోపు అయితే 3 రోజులు, 1000–2000 కి.మీ అయితే 10 రోజులు, 2 వేల పైన కి.మీ ఉంటే 12 రోజులు ఈ వేబిల్లులు చెల్లుబాటు అవుతాయి. ఈ లోపు సరుకులు గమ్యస్థానానికి చేరని పక్షంలో ఆ వేబిల్లులు చెల్లుబాటు కావు. అదే విధంగా ఒకే ఇన్వాయిస్ మీద ఉన్న సరుకులను రెండు వాహనాల్లో రవాణా చేయాల్సి వస్తే రెండు వేబిల్లులు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఆగని దందా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, ఉన్నతాధికారుల కనుసన్నలలో మెలుగుతూ, మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే చెక్‌పోస్టులలో ప్రాధాన్యం దక్కుతుందన్న చర్చ కూడా ఉంది. రవాణా శాఖ డీటీసీ, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, సీటీ ఓ కార్యాలయాలలో కీలక స్థానాలలో కొనసాగుతున్న కొందరు అధికారులు ఏడాదికోసారి చెక్‌పోస్టు డ్యూటీల ను ఖరారు చేస్తూ పెద్ద మొత్తంలో వాటాలు, నజరానాలు పొందుతున్నారని ఆ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో అయితే డిప్యూటీ కమిషనర్‌తోపాటు సీటీఓలను ప్రసన్నం చేసుకుంటేనే సాలూర, మద్నూరు చెక్‌పోస్టులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ)ల నియామకం జరుగుతుందంటున్నారు. రోజువారీ వసూళ్లు రూ.లక్షల్లోనే సాలూర, సలాబత్పూర్, పొందుర్తి చెక్పోస్ట్టులలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. తరచూ జరుగుతున్న ఏసీబీ దాడులలో బయట పడుతున్న అక్రమ వసూళ్ల బాగోతాలే ఇందుకు సాక్ష్యాలు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని మరీ అధికారులు లక్షలు గడిస్తున్నారు. ఉన్న తాధికారులు పట్టించుకోకపోవడం, స్థానిక పరి స్థితులు వారికి కలిసి వస్తున్నాయి. ఆడపాదడపా ఏసీబీ అధికారులు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పర్వాన్ని నియంత్రించలేకపోతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దున, బోధన్ మండల కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలో సాలూర వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. రవాణా, వాణిజ్య పన్నుల, పౌర సరఫరాల, ఎక్సైజ్ శాఖలతో పాటు వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు కూడా ఉంది. ఈ ఉమ్మడి తనిఖీ కేంద్రానికి వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డీసీటీఓ స్థాయి అధికారి ఏఓ (అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్)గా వ్యవహరిస్తారు. సాలూరతోపాటు మద్నూరు చెక్‌పోస్టు, పొందుర్తి ఆర్టీఏ చెక్‌పాయింట్ ద్వారా పెద్ద సంఖ్యలో వాహనాలు రకరకాల సరుకులతో వెళ్తుంటాయి. ఆ వాహనాల నుంచి ప్రతి చెక్‌పోస్టులో ఎంట్రీల పేరిట వసూలుకు తోడు రకరకాల కారణాలతో రోజూ సుమారుగా రూ.75 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అధికారుల ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. లారీకో రేటు చెక్‌పోస్టులలో లారీకో రేటు ఖరారు చేసి వసూలు చేయడం ‘మామూలు’గా మారింది. సరుకుల అక్రమ రావాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఈ తనిఖీ కేంద్రాలలో, నిబంధనలకు అనుగుణంగా సరుకులు రవాణా చేసినా చేతులు తడపనిదే లారీలు కదలనివ్వని పరిస్థితి నెలకొందని కొందరు వ్యాపారులే వాపోతున్నారు. రోజూ ఈ చెక్‌పోస్టుల ద్వారా పెద్ద సంఖ్యలో లారీలు వెళ్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అమ్మకపు పన్ను (వ్యాట్), రవాణా అనుమతి పత్రాలు (వేబిల్లు) చూపి ంచినా, అడి గినంత సమర్పించుకున్నాకే లారీలు కదులనిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. అన్నిరకాల కాగితాలు ఉన్నా, మామూళ్ల తతంగం పూర్తయితేనే ముద్ర వేయడం ఆనవాయితీగా మార్చారు. ఇంత జరుగుతున్నా చెక్‌పోస్టుల డ్యూటీల కోసం పోటీపడుతున్న అధికారులు, వారిని ప్రోత్సహిస్తున్న ఉన్నతాధికారులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
- అడ్డుకున్న రెవెన్యూ అధికారులు - వే బిల్లులు లేకుండానే రవాణా - కందికట్కూర్ క్వారీలో 78 లారీలు పట్టివేత - రూ.19.50 లక్షలు జరిమానా సిరిసిల్ల రూరల్ : జిల్లాలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా విదిల్చారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ ఇసుక క్వారీలపై శుక్రవారం రాత్రి దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 78 లారీలను అడ్డుకున్నారు. వేబిల్లులు లేకుండానే ఇసుక సరిహద్దులు దాటిస్తున్నట్లు తేలింది. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో తహ శీల్దార్ సుమా శనివారం పంచనామా నిర్వహించారు. ఒక్కో లారీకి రూ.25 వేల చొప్పున రూ.19.50 లక్షలు జ రిమానా విధించారు. అయితే ఈ జరిమానా చెల్లించేందుకు క్వారీ నిర్వాహకులు, లారీ యజమానులు ముందుకురావడం లేదు. జరిమానా చెల్లించకుండా లారీలను విడిపించుకునేందుకు క్వారీ నిర్వాహకులు అధికార పార్టీ నాయకులతో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. నెల క్రితం వేములవాడ మండలం ఆరెపల్లి వద్ద లారీ ఢీకొని పది మంది మృతిచెందడంతో ఇసుక రవాణా విషయం తెరమీదికి వచ్చింది. అయితే ఇసుక లారీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. డీఆర్సీ సమావేశంలోనూ ఎమ్మెల్యేలు మంత్రి వద్ద ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఆలస్యంగానైన రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. శుక్రవారం బోయినపల్లి మీదుగా సిరిసిల్ల రూరల్, వేములవాడ పట్టణ, రూరల్ సీఐలు, నలుగురు ఎస్సైలు, 20 మంది సిబ్బందితో దాడు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఓ మంత్రితోనే జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి ఇటు రెవెన్యూ, అటు పోలీసులు జంకుతున్నారు. ఏడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత నిమ్మపల్లి(కోనరావుపేట): మూలవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. మండలంలోని నిమ్మపల్లిలోని మూలవాగు నుంచి ప్రతి రోజూ ఇసుక రవాణా జరుగుతోంది. గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. తహశీల్దార్ ముఖీధుల్ హక్, ఆర్ఐ గోపాల్ వచ్చి ట్రాక్టర్లను పట్టుకున్నారు.