సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, ఉన్నతాధికారుల కనుసన్నలలో మెలుగుతూ, మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే చెక్‌పోస్టులలో ప్రాధాన్యం దక్కుతుందన్న చర్చ కూడా ఉంది. రవాణా శాఖ డీటీసీ, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, సీటీ ఓ కార్యాలయాలలో కీలక స్థానాలలో కొనసాగుతున్న కొందరు అధికారులు ఏడాదికోసారి చెక్‌పోస్టు డ్యూటీల ను ఖరారు చేస్తూ పెద్ద మొత్తంలో వాటాలు, నజరానాలు పొందుతున్నారని ఆ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో అయితే డిప్యూటీ కమిషనర్‌తోపాటు సీటీఓలను ప్రసన్నం చేసుకుంటేనే సాలూర, మద్నూరు చెక్‌పోస్టులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ)ల నియామకం జరుగుతుందంటున్నారు.
రోజువారీ వసూళ్లు రూ.లక్షల్లోనే
సాలూర, సలాబత్‌పూర్, పొందుర్తి చెక్‌పోస్ట్టులలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. తరచూ జరుగుతున్న ఏసీబీ దాడులలో బయట పడుతున్న అక్రమ వసూళ్ల బాగోతాలే ఇందుకు సాక్ష్యాలు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని మరీ అధికారులు లక్షలు గడిస్తున్నారు. ఉన్న తాధికారులు పట్టించుకోకపోవడం, స్థానిక పరి స్థితులు వారికి కలిసి వస్తున్నాయి.
ఆడపాదడపా ఏసీబీ అధికారులు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పర్వాన్ని నియంత్రించలేకపోతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దున, బోధన్ మండల కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలో సాలూర వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. రవాణా, వాణిజ్య పన్నుల, పౌర సరఫరాల, ఎక్సైజ్ శాఖలతో పాటు వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు కూడా ఉంది.
ఈ ఉమ్మడి తనిఖీ కేంద్రానికి వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డీసీటీఓ స్థాయి అధికారి ఏఓ (అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్)గా వ్యవహరిస్తారు. సాలూరతోపాటు మద్నూరు చెక్‌పోస్టు, పొందుర్తి ఆర్టీఏ చెక్‌పాయింట్ ద్వారా పెద్ద సంఖ్యలో వాహనాలు రకరకాల సరుకులతో వెళ్తుంటాయి. ఆ వాహనాల నుంచి ప్రతి చెక్‌పోస్టులో ఎంట్రీల పేరిట వసూలుకు తోడు రకరకాల కారణాలతో రోజూ సుమారుగా రూ.75 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అధికారుల ఆదాయాన్ని అంచనా వేయవచ్చు.
లారీకో రేటు
చెక్‌పోస్టులలో లారీకో రేటు ఖరారు చేసి వసూలు చేయడం ‘మామూలు’గా మారింది. సరుకుల అక్రమ రావాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఈ తనిఖీ కేంద్రాలలో, నిబంధనలకు అనుగుణంగా సరుకులు రవాణా చేసినా చేతులు తడపనిదే లారీలు కదలనివ్వని పరిస్థితి నెలకొందని కొందరు వ్యాపారులే వాపోతున్నారు. రోజూ ఈ చెక్‌పోస్టుల ద్వారా పెద్ద సంఖ్యలో లారీలు వెళ్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
అమ్మకపు పన్ను (వ్యాట్), రవాణా అనుమతి పత్రాలు (వేబిల్లు) చూపి ంచినా, అడి గినంత సమర్పించుకున్నాకే లారీలు కదులనిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. అన్నిరకాల కాగితాలు ఉన్నా, మామూళ్ల తతంగం పూర్తయితేనే ముద్ర వేయడం ఆనవాయితీగా మార్చారు. ఇంత జరుగుతున్నా చెక్‌పోస్టుల డ్యూటీల కోసం పోటీపడుతున్న అధికారులు, వారిని ప్రోత్సహిస్తున్న ఉన్నతాధికారులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఆగని దందా
Published Mon, Aug 25 2014 2:54 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement