ఐటీ దిగ్గజాలకు రానున్నది గడ్డుకాలమేనట!
ముంబై: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐటీ రంగంపై ఐటీ నిపుణులు మరో బాంబు పేల్చారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బలంగా ఉండే క్యూ-2 ఫలితాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో నిరాశాజనకంగా ఉండనున్నాయని వెల్లడించారు.
భారత ఐటీ రంగం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. గత జులై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో గత 8 సంవత్సరాలుగా లేని బలహీనమైన ట్రెండ్ ఉంటుందని నివేదించారు. ఆయా కంపెనీల ఆదాయం, నికర లాభం తదితరాలు గణనీయంగా తగ్గనున్నాయని రిపోర్ట్ చేశారు. డాలర్ పరంగా ఐటీ సంస్థల ఆదాయం క్షీణించడం, ఈ పరిణామాలకు దారి తీయనుందని మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో పేర్కొంది. 2016-17 ఆర్థికసంవత్సరానికి టాప్-5 ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి ఇన్ఫోసిస్ 3 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.6 శాతం, ఆ తర్వాత టీసీఎస్ 2.4 శాతం, విప్రో 0.5 శాతంగా ఉండదనుందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక అంచనావేసింది. గ్రోత్ అండ్ మార్జిన్ విషయంలో ఈ ఏడాది గడ్డుకాలమేనని సెంట్రమ్ వ్యాఖ్యానించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెక్సిట్ వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మరికొంతమంది తెలిపారు. సంప్రదాయ ఐటీ వ్యాపారం ఆటోమేషన్ దిశగా సాగుతుండటం, కొత్త క్లయింట్ల చేరిక ఆశాజనకంగా లేకపోవడం ఇందుకు కారణాలని విశ్లేషించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మందగమనం, బ్రెగ్జిట్ పరిణామాలు తదితర అంశాలు భారతీయ ఐటి కంపెనీల పాలిట ఇబ్బందికర పరిణామాలని అభిప్రాయపడ్డారు. వృద్ధి మందగించడం ఒక కారణమైతే, కంపెనీలే ముందుకొచ్చి భయంతో గైడెన్స్ తగ్గించడం మరో ప్రమాదమని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, మైండ్ ట్రీ తదితరాలు ఇప్పటికే తమ ఆదాయంపై అతిగా ఆశలు పెట్టుకోవద్దన్న సంకేతాలిచ్చాయి. ఇప్పటికే ఒకసారి గైడెన్స్‌ను తగ్గించిన ఇన్ఫోసిస్ ఈ క్వార్టర్లో మళ్లీ అంచనాను తగ్గించవచ్చని ఇండస్ట్రీ భావిస్తోంది. అలాగే ఈ సంవత్సరం 10 నుంచి 11.5 శాతం మధ్య వృద్ధి ఉంటుందని ఇన్ఫీ ప్రకటించగా, అది 9 శాతాన్ని మించకపోవచ్చని ఐటీ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను వచ్చేవారం ప్రకటించనున్నాయి.