భళా బలియా..!
జలుబు, దగ్గు వస్తే ఇంట్లోనే పసుపు మింగో, నాలుగు తులసి ఆకులు నమిలో తగ్గించుకుంటాం. జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటివి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్లి నయం చేసుకుంటాం. ఎందుకంటే అవి వాతావరణ మార్పిడి వల్ల వచ్చి వెళ్తుంటాయి కాబట్టి. మరి రోజూ తాగే నీరే కలుషిత మైతే, దానివల్ల జబ్బులు చుట్టుముడితే ఏం చేయాలి? ఉత్తరప్రదేశ్లోని బలియా గ్రామస్తులు ఇదే ప్రశ్న వేశారు. ఒకరోజు రెండు రోజులు కాదు... కొన్ని నెలలు! కానీ వారికి ఎవరూ సమాధానం చెప్పలేదు. అందుకే ఆ సమాధానాన్ని వాళ్లే వెతుక్కున్నారు.
ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బోర్లు వేయించి చేతి పంపులు అమర్చింది. ఆ రోజు బలియా గ్రామస్తుల సంతోషం అంతా ఇంతా కాదు. అయితే అంతటి సంతోషం కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది. బోరింగ్ నీళ్లు తాగడం మొదలు పెట్టిన తర్వాత చర్మ వ్యాధులు రావడం మొదలైంది. చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం రంగు మారడం, కాళ్లూ చేతులు వాయడం వంటి సమస్యలు తలెత్తాయి.
తర్వాత కొన్ని రోజులకే దగ్గు, అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లాంటి సమస్యలు కూడా ముంచెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగారు. అధికారులకు తమ గోడును విన్నవించు కున్నారు. రెండేళ్లకు గానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సర్వే చేయించలేదు. తీరా చేయించాక తెలిసిందేమిటంటే... బోరింగుల్లోని నీటిలో ఆర్సెనిక్ అనే రసాయనం ఉందని, దాని కారణంగానే ఈ రోగాలు వస్తున్నాయని. అయితే పరిష్కార మార్గాలు వెతకడానికి సమయం కావాలన్నారు అధికారులు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని కదా!
అయితే యేళ్లు గడిచాయి. సమస్యలు ఉధృతమయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. చూసి చూసి విసిగిపోయారు గ్రామస్తులు. కళ్లముందే తమవాళ్లు నరకయాతన పడుతుంటే చూడలేకపోయారు. ఎవరి సాయం కోసం చూడకుండా తామే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు.
తమ ప్రాంతంలో 30-40 మీటర్ల లోతులోనే ఈ ఆర్సెనిక్ రసాయనం ఉందన్న విషయం అధికారుల ద్వారా తెలిసింది గ్రామస్తులకి. తమ ఇళ్లలోని బావుల లోతు వాటి కంటే తక్కువే. కాబట్టి బావుల నీటిలో ఆర్సెనిక్ ఉండదు. అంటే ఆ నీరు సురక్షితమే. తాగొచ్చు. కానీ బోర్లు పడ్డాయి కదా అని బావుల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అవన్నీ చెత్తతో పూడుకుపోయే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికైనా బాగు చేయకపోతే పూర్తిగా మూసుకుపోతాయి. అందుకే ఇక ఆలస్యం చేయలేదు. బావుల్ని పునరుద్ధరించే పని మొదలు పెట్టారు.
బలియా గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు, ధనిక్రామ్ వర్మ అనే 95 ఏళ్ల వృద్ధుడు ఈ మహాయజ్ఞానికి నాంది పలికారు. ఊళ్లోవాళ్లందరినీ ఒక్కచోటికి చేర్చారు. తాము చేయవలసినదేమిటో వివరించారు. అందరినీ కలుపుకుని బావుల పునరుద్ధరణ ప్రారంభించారు. చేయి చేయి కలిస్తే, అందరూ ఒక్క తాటి మీద నడిస్తే... సాధ్యం కానిది ఏముం టుంది! వారి ప్రయత్నం ఫలించింది. ఊరి బావులకు కొత్త కళ వచ్చింది. వాటిలోని నీరు వారికి ఆధారమైంది. వారి రోగాలకు ముగింపు పలికింది. జీవితాలను మళ్లీ ఆనందమయం చేసింది.
అయితే ధనిక్రామ్ వర్మ దానితోనే సంతోషపడి ఊరుకోలేదు. ఆ రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఈ ఆర్సెనిక్ సమస్య ఉందని తెలుసుకొని, తన గ్రామస్తులతో కలిసి ఆ ఊళ్లన్నీ తిరిగాడు. తాము అనుసరించిన విధానాన్నే వారికీ నేర్పించాడు. పాడు బడిన బావుల్ని బాగు చేయించాడు. అసలు బావులే లేని చోట తవ్వించాడు.
ఇప్పుడు ఆ గ్రామాలన్నీ ఆర్సెనిక్ నుంచి విముక్తి పొందాయి. ఆరోగ్య కరమైన నీటినే తాగుతూ ఆనందంగా ఉంటున్నాయి. ఇదంతా బలియా గ్రామస్తుల చలవ అని గొప్పగా చెబుతు న్నాయి. నిజమే మరి. వాళ్లే కనుక ముంద డుగు వేయకపోతే, అంత పెద్ద సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇందరి జీవితా ల్లోకి సంతోషం వచ్చేదీ కాదు.
- నిఖిత నెల్లుట్ల